కేజ్రీవాల్ తో ఫోన్ లో మాట్లాడిన కన్హయ్య

17 Mar, 2016 21:55 IST|Sakshi
కేజ్రీవాల్ తో ఫోన్ లో మాట్లాడిన కన్హయ్య

న్యూ ఢిల్లీః ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి యూనియన్ నాయకుడు కన్హయ్య ఫోన్ లో సంభాషించారు. ముందుగా ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించిన కన్హయ్య వీలు కుదరకపోవడంతో ఫోన్ లోనే మాట్లాడారని సీపీఐ నాయకుడు డి రాజా తెలిపారు. అయితే విద్యార్థి కార్యకర్త అపరాజితతో కలసి రాజా ముఖ్యమంత్రిని కలవడం ప్రత్యేకత సంతరించుకుంది.

తన కుమార్తె... జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్థి కార్యకర్త అపరాజిత తో సహా.. రాజా ఢిల్లీ సచివాలయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిశారు. ముఖ్యమంత్రిని కలసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన.. కన్హయ్య ట్రాఫిక్ జామ్ కారణంతో రాలేకపోయాడని, ముఖ్యమంత్రితో టెలిఫోన్ లో సంభాషించాడని తెలిపారు. బహుశా తిరిగి శనివారం వారిద్దరూ కలిసే అవకాశం ఉందని కూడ వెల్లడించారు.

అయితే అపరాజిత ముఖ్యమంత్రిని కలిసేందుకు నా కుమార్తెగా రాలేదని, జెఎన్ యు విద్యార్థి కార్యకర్తగా, దేశద్రోహం కేసులో జైలు నుంచి బెయిల్ పై విడుదలైన కన్హయ్య కుమార్ కు మద్దతుదారుగా వచ్చిందని రాజా తెలిపారు. కన్హయ్య కుమార్, అపరాజితలు ఇద్దరూ సీపీఐ ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఎస్ ఎఫ్) సభ్యులే. కాగా కన్హైయా కుమార్ విషయంలో సీపీఐకి ఏవైనా భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు ఉన్నాయా అన్న విలేకరుల  ప్రశ్నకు రాజా అటువంటివేమీ లేవని సమాధానం ఇచ్చారు.

మరిన్ని వార్తలు