చెత్తడబ్బాల్లో మాత్రం అవి దొరికాయట..

10 Jan, 2020 14:00 IST|Sakshi

పోలీసులపై కన్హయ్య కుమార్‌ విమర్శలు

న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులను అసభ్యంగా దూషించడం, నిందించడం వల్ల జాతి సమస్యలు పరిష్కారం కావని విద్యార్థినాయకుడు కన్హయ్య కుమార్‌ అన్నారు. తమను జాతి విద్రోహులుగా పిలిచినంత మాత్రాన దేశం బాగుపడదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్‌యూలో ముసుగులు ధరించిన దుండుగులు దాడిచేసి పలువురు విద్యార్థులు, టీచర్లను ఆదివారం తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌ తల పగిలి తీవ్ర రక్తస్రామమైన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఘటనను నిరసిస్తూ... జేఎన్‌యూ విద్యార్థులు ర్యాలీలు చేపడుతుండగా పోలీసులు భగ్నం చేస్తున్నారు. ఇక పలువురు బీజేపీ నేతలు సైతం ఆయిషీ ఘోష్‌ సహా జేఎన్‌యూ విద్యార్థులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.(ఆమె తలపై ఉన్నది రక్తమేనా; కంపరంగా ఉంది)

ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ మాట్లాడుతూ...‘ మమ్మల్ని ఎంతగా అసభ్యంగా తిట్టాలనుకుంటే అంతగా తిట్టండి. జాతి విద్రోహులు అని పిలవండి. అయితే వీటి వల్ల మీ పిల్లలకు ఉద్యోగాలు రావు. మీకు భద్రత చేకూరదు. కనీస అవసరాలు తీరవు. మీరెందుకు ఇంతగా విసుగెత్తిపోతున్నారో నేను అర్థం చేసుకోగలను. కనిపించకుండా పోయిన వాళ్లను కనిపెట్టడం పోలీసులకు కుదరడంలేదు గానీ... జేఎన్‌యూ చెత్తడబ్బాల్లో 3 వేల కండోమ్‌లు దొరికాయట. అసలు వాళ్లు అంత కచ్చితంగా ఎలా లెక్కపెట్టగలిగారో’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. తుక్డేగ్యాంగ్‌ అంటూ తమను విమర్శిస్తున్న వాళ్లను ఉద్దేశించి... జేఎన్‌యూలో ప్రవేశం అంత సులభంగా ఏమీ లభించదని గుర్తు పెట్టుకోండని హితవు పలికారు.

కాగా 2016లో బీజేపీ నేత ఙ్ఞాన్‌దేవ్‌ అహుజా జేఎన్‌యూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..‘ అక్కడ రోజూ 3 వేల బీరు క్యాన్లు దొరుకుతాయి. 2 వేల మద్యం బాటిళ్లు ఉంటాయి. పదివేల కాల్చేసిన సిగరెట్‌ పీకలు... 4 వేల బీడీలు, 50 వేల మాంసపు ఎముకలు, 2 వేల చిప్స్‌ కవర్లు, 3 వేల కండోమ్‌లు, 5 వందల అబార్షన్‌ ఇంజక్షన్లు ఉంటాయి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ కోసం రెండేళ్లపాటు వెదికినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ కేసును విచారించిర సీబీఐ దానిని క్లోజ్‌ చేసింది.

మరిన్ని వార్తలు