కరుణానిధి అంత్యక్రియలను అడ్డుకోవాలనే...

10 Aug, 2018 15:14 IST|Sakshi

సాక్షి, చెన్నై : దివంగత నేత, కలైంజ్ఞర్‌ కరుణానిధి అంత్యక్రియల విషయంలో పళనిసామి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి మండిపడ్డారు. కరుణానిధి అంత్యక్రియలు అడ్డుకోవడంలో శ్రద్ధ చూపిన ప్రభుత్వం.. తూత్తుకుడి స్టెరిలైట్‌ పరిశ్రమ తెరవకుండా వేదాంత గ్రూపును మాత్రం అడ్డుకోలేకపోయిందని విమర్శించారు. పర్యావరణ నిబంధనలు, కోర్టులో పిటిషన్లను సాకుగా చూపుతూ అధికార అన్నాడీఎంకే ప్రభుత్వం మెరినా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు అడ్డుపుల్ల వేసిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాగా తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ పరిశ్రమ తెరిచేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్‌.. వేదాంత గ్రూపునకు గురువారం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కనిమొళి ప్రభుత్వ తీరును విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా..?
‘స్టెరిలైట్‌ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. కానీ పరిశ్రమను తెరిచేందుకు వేదాంత గ్రూపునకు ఎన్జీటీ షరతులతో కూడిన అనుమతినిచ్చింది. కలైంగర్‌ అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో జరగకుండా అడ్డుకునేందుకు సీఎస్‌ వైద్యనాథన్‌(ప్రభుత్వ న్యాయవాది) తీవ్రంగా శ్రమించారు. కానీ ప్రజల ప్రాణాలు బలిగొన్న పరిశ్రమను తెరవకుండా సరైన వాదనలు వినిపించలేకపోయారు. తమిళనాడును అన్ని విధాలుగా దిగజార్చేందుకే సీఎం ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నారేమో అనే సందేహం కలుగుతుందంటూ’ కనిమొళి ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు