సినీ నటుడు ధ్రువ్‌ ఆత్మహత్య!

2 Aug, 2017 09:01 IST|Sakshi
కన్నడ సినీ నటుడు ధ్రువ్‌ ఆత్మహత్య!
►35 ఏళ్లకే ముగిసిన జీవితం
►ఆర్థిక ఇబ్బందులతో అఘాయిత్యం!
►మూగ, బధిర అయినా సినీ, క్రికెట్‌ రంగాల్లో రాణింపు
►నివ్వెరపోయిన అభిమానులు
►ప్రముఖ హీరోల సంతాపం
 
యలహంక (బెంగళూరు): కన్నడ సినీ నటుడు, సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌(సీసీఎల్‌) ద్వారా తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితుడైన ధ్రువ్‌శర్మ(35) అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు బెంగళూరు రాజన్నకుంట్టె పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సొంత కంపెనీలో నష్టాలు రావడం, అప్పుల బాధ తట్టుకోలేక తన కుమారుడు ధ్రువ్‌ శర్మ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తండ్రి సురేష్‌శర్మ మంగళవారం పోలీసులకు తెలిపారు.

ధ్రువ్‌ శనివారం పురుగుల మందు తాగగా, కుటుంబ సభ్యులు ఆయన్ను సమీపంలోని కొలంబియా ఏషియా ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి మంగళవారం వేకువ జామున ఆయన మరణించారు. ధ్రువ్‌ పుట్టుకతోనే మూగ, చెవిటి. అయినప్పటికీ పట్టుదలతో నటనలో శిక్షణ పొంది పలు కన్నడ సినిమాల్లో హీరోగా నటించి పేరు తెచ్చుకున్నారు.  ధ్రువ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు.   
 
ధ్రువ్‌ గురించి ఒక్క మాటలో చెప్పమంటే...రచ్చ గెలిచాడు. ఇంటిని గెలవలేక పోయాడు.’ అని సినీ పెద్దలు చెప్పినమాట. శాండల్‌వుడ్‌ నటుడు, మంచి క్రికెటర్, అందులోనూ దివ్యాంగుడైన ధ్రువ్‌ ఆకస్మిక మరణం అతని అభిమానులను, సినీ రంగాన్ని తీవ్ర విచారానికి గురిచేసింది.
35 ఏళ్ల ధ్రువ్‌ పుట్టుకతోనే మూగ, చెవుడు. అయినా చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. పట్టుదలతో వైకల్యాన్ని అధిగమించి సినీ రంగంలోను, క్రికెట్‌లోనూ రాణించాడు. భారత దివ్యాంగుల క్రికెట్‌ జట్టులోనూ ఆడాడు. అటు పై నటన పై మక్కువతో నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు. మాటలు రాకపోయినా డైరెక్టర్‌ ఎలా నటించాలో పేపర్‌పై రాసి చూపిస్తే ఇలా అల్లుకుపోయేవాడని సహచర నటులు గుర్తుచేసుకున్నారు.

స్నేహాంజలితో వెండితెరపైకి
స్నేహాంజలి సినిమా ద్వారా శాండల్‌వుడ్‌లో అడుగుపెట్టిన అతను బెంగళూరు–560023, నీనంద్రే ఇష్టకనో, టిప్పాజీ వంటి హిట్‌ చిత్రాల్లో హీరోగా నటించాడు. ఇతను నటించిన కిచ్చు సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇక సినీ, క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించిన సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌)లో ధృవ్‌ తన బ్యాటింగ్‌ విన్యాసాలతో ప్రేక్షకులను అలరించేవాడు. ఇప్పటి వరకూ సీసీఎల్‌కు సంబంధించి 10 మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌లు, రెండు మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌లు ధ్రువ్‌నే గెలుచుకున్నాడంటే ఇతని క్రికెట్‌ నైపుణ్యం ఏపాటితో అంచనా వేయవచ్చు. ధ్రువ్‌ మరణవార్త తెలుసుకుని బాలీవుడ్‌ నటుడు రితీష్‌ దేష్‌ముఖ్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. ఇక శాండల్‌వుడ్‌ నటీనటులు కూడా ధ్రువ్‌తో తమకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుని ఆవేదన చెందారు.

నమ్మలేకపోతున్నా: సుదీప్‌
హీరో కిచ్చ సుదీప్‌ స్పందిస్తూ, ధ్రువ్‌ మరణించాడంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, నిద్రపోయినవాడిలాగా ఉన్న ధ్రువ్‌ భౌతికకాయాన్ని చూస్తుంటే తన ఊపిరి ఆగిపోనట్లనిపించిందని ఆవేదనతో ట్వీట్‌ చేశారు.
హృదయం చలించిపోయింది: జగ్గేష్‌
హాస్య నటుడు జగ్గేష్‌ స్పందిస్తూ, ఆత్మహత్యకి పాల్పడిన ధ్రువ్‌ తన స్నేహితుడు డాక్టర్‌. శర్మ కుమారుడని, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నానని తెలిపారు. ఇలా జరిగిందని తెలిసి హృదయం చలించిపోయిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
చావు పరిష్కారం కాదు: శివరాజ్‌కుమార్‌
హ్యాట్రిక్‌ హీరో శివరాజ్‌కుమార్‌ స్పందిస్తూ మనిషి బ్రతకటానికి అనేక మార్గాలు ఉన్నాయని, ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారానికి స్నేహితులను సంప్రదించాలని, ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుందని, మరణం పరిష్కారం కాదని అన్నారు.  యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని హితవు పలికారు. ధ్రువ్‌ మృతికి సంతాపం ప్రకటించారు.
కర్ణాటక టెండూల్కర్‌: ప్రేమ్‌
ధ్రువ్‌ శర్మ ఒక నటుడు మాత్రమే కాదని అద్బుతమైన క్రికెటర్‌ అని, కర్ణాటక టెండూల్కర్‌గా వెలిగాడని, ధృవకు మాటలు వచ్చేవి కాదని, తనకున్న హృదయంతో అందరితో మాట్లాడేవాడని నటుడు ప్రేమ్‌ గుర్తుచేసుకున్నారు. కన్నడ సినిమా రంగానికే అతను స్పెషల్‌ చైల్డ్‌ అని అలాంటి నటుణ్ని పోగొట్టుకోవడం చాలా బాధాకరమని తెలిపారు.
త్వరలో కిచ్చు విడుదల: ద్వారకీష్‌
ధ్రువ్‌ వంటి మంచి యువకుడిని పోగొట్టుకోవడం చాలా బాధగా ఉందని, స్నేహం కోసం కిచ్చ సుదీప్‌ అతని ‘కిచ్చు’ సినిమాలో నటించాడని, త్వరలోనే ఆ సినిమా విడుదల కానుందని నిర్మాత యోగిష్‌ ద్వారకీష్‌ అన్నారు.
మరిన్ని వార్తలు