మా తండ్రి ఏ తప్పూ చేయలేదు : భావన

10 Dec, 2017 09:10 IST|Sakshi

పోలీసు విచారణలో రవి బెళగెరె

లోతుగా సుపారీ కేసు దర్యాప్తు 

అజ్ఞాతంలో రెండవ భార్య యశోమతి

తరచూ పోలీసులకే ప్రశ్నలు సంధించే ప్రముఖ క్రైం పాత్రికేయుడు రవి బెళగెరె పరిస్థితి తారుమారైంది. పోలీసులే ఆయనను ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. సుపారీ కేసులో ఆయన పాత్రపై కూపీ లాగుతున్నారు. ఈ కేసులో 48 గంటల్లోనే అనేక ఆసక్తికర పరిణామాలు సంభవించడం గమనార్హం. 

సాక్షి, బెంగళూరు: తన కార్యాలయంలో పనిచేస్తున్న పాత్రికేయుడు సునీల్‌ హెగ్గరవళ్లిని హత్య చేయాలని సుపారీ ఇచ్చారన్న ఆరోపణలతో అరెస్టైన హాయ్‌ బెంగళూరు వార పత్రిక సంపాదకుడు రవి బెళగెరె (59)పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం రవి బెళగెరెను అరెస్ట్‌ చేసిన సిటీ పోలీసులు అనంతరం ఆయన్ను 1వ ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి జగదీష్‌ నివాసంలో హాజరు పరిచారు. రవి బెళగెరెకు నాలుగు రోజుల కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి ఆదేశించారు.  ఈ నేపథ్యంలో రవి బెళగెరెను తమదైన శైలిలో పోలీసులు విచారిస్తున్నారు. సునీల్‌ను చంపాల్సిన అవసరం ఏమిటి? ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌తో మీకున్న సంబంధం ఏమిటి? ఎంత సుపారీ ఇచ్చారు? గౌరి లంకేష్‌ హత్యతో కూడా మీకు ఏదైనా సంబంధం ఉందా? వంటి ప్రశ్నలతో పోలీసులు రవి బెళగెరెను ఉక్కిరిబిక్కిరి చేసినట్లు సమాచారం. కాగా వీటన్నింటికి కూడా తనకేమీ తెలియదనే సమాధానమే రవి బెళగెరె ఇచ్చినట్లు తెలుస్తోంది.  రెండో భార్య నివాసం ‘హిమ బెళగెరె’కు సీసీబీ పోలీసులు తీసుకెళ్లి పలు విషయాలపై ప్రశ్నలు అడిగారు. 

మా తండ్రి ఏ తప్పూ చేయలేదు: కూతురు 
కాగా తన తండ్రి ఏ తప్పూ చేయలేదని రవి బెళగెరె కుమార్తె భావన చెప్పారు. ‘రవి బెళగెరెపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. శశిధర్‌ ముండేవాడగి అనే క్రిమినల్‌ చెప్పిన విషయాలను అనుసరించి పోలీసులు రవి బెళగెరెను అరెస్ట్‌ చేశారు. కేవలం ఆరోపణలను ఆధారంగా చేసుకొని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అసలు నిజాలు న్యాయస్థానంలోనే తెలుస్తాయి’ అని భావన చెప్పారు. 

ఫామ్‌హౌస్‌లలో తనిఖీలు 
సీసీబీ విభాగం డీసీపీ జినేంద్ర కణగావి నేతృత్వంలో ఏసీపీ సుబ్రహ్మణ్యం, ఇన్‌స్పెక్టర్‌ రాజు అధికారుల బృందం రవి బెళగెరెను విచారిస్తూ వివిధ ప్రశ్నలకు సమాధానాలు సేకరిస్తున్నారు. చిక్కమగళూరు, దాండేలి ప్రాంతాల్లోని రవి బెళగెరె ఫామ్‌ హౌస్‌లలో సైతం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇక తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, అందువల్ల తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పాత్రికేయుడు సునీల్‌ హెగ్గరవళ్లి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. 

ఇంటి నుంచే ఆహారం
ఇక రవి బెళగెరెకు ఇంటి నుండే ఆహారం తీసుకునేందుకు అధికారులు అనుమతించారు. రవి బెళగెరె మధుమేహంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆయనకు కావాల్సిన ఔషధాలను అందజేస్తున్నారు. రవి బెళగెరె కుటుంబ సభ్యులు కూడా సీసీబీ పోలీసు స్టేషన్‌ వద్దనే శుక్రవారం రాత్రంతా ఉండిపోయారు.

అజ్ఞాతంలోకి యశోమతి 
ఇక రవి బెళగెరె అరెస్ట్‌ అనంతరం ఆయన రెండో భార్య యశోమతి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. వెంటనే ఆమె ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కూడా క్లోజ్‌ అయింది. సునీల్‌ హెగ్గరవళ్లితో యశోమతికి సన్నిహిత సంబంధం ఉండడంతోనే సునీల్‌ను చంపేందుకు రవి బెళగెరె సుపారీ ఇచ్చారన్న వార్తల నేపథ్యంలో ఆమె కనిపించకుండా పోవడం చర్చనీయాంశమైంది. రవి బెళగెరె అరెస్ట్‌ పై స్పందించేందుకు ఆయన మొదటి భార్య లలితా బెళగెరె సైతం నిరాకరించారు. లలితా బెళగెరె తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా, భర్త అరెస్టుతో మరింత అస్వస్థతకు గురయ్యారు. 

మరిన్ని వార్తలు