ప్రధాని సిఫార్సునూ పక్కనపెట్టారు

11 Mar, 2018 19:43 IST|Sakshi

సాక్షి, కాన్పూర్‌ : ప్రధాని నరేంద్ర మోదీ సిఫార్సు చేసినా యూపీలోని కాన్పూర్‌కు చెందిన కార్పెంటర్‌ సందీప్‌ సోనీకి రుణం మంజూరు చేయకుండా బ్యాంకర్లు ముప్పతిప్పలు పెడుతున్నారు. సోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రుణం కోసం 2016లో ప్రధాని సాయం కోరారు. భగవద్గీత శ్లోకాలను చెక్కపై సోనీ చెక్కిన తీరును మెచ్చుకున్న మోదీ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద అతనికి రుణం మంజూరు చేయాలని అధికారులకు స్వయంగా సిఫార్సు చేశారు. అయితే రుణం కోసం బ్యాంకు అధికారులు తనను తిప్పుకుంటున్నారని ఫిర్యాదు చేస్తూ సోని ప్రస్తుతం ప్రధానికి లేఖ రాశారు.

ఏడాది పాటు రుణం కోసం తిప్పుకున్న బ్యాంకు అధికారులు రూ 10 లక్షలతో వ్యాపారం ప్రారంభించాలని చెబుతున్నారని, తాను కోరిన రూ 25 లక్షల రుణం మంజూరు చేయడం లేదని వాపోయారు. రూ 25 లక్షలతో తన ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉండగా కేవలం రూ 10 లక్షలే రుణం ఇవ్వడంతో తన పనులు ఆగిపోయాయని, బ్యాంకులు రోజుకో నిబంధనతో తనను వేధిస్తున్నాయని సోని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని స్వయంగా జోక్యం చేసుకుంటే తన ఇబ్బందులు తొలగిపోతాయని సోని ఆశిస్తున్నారు. 

మరిన్ని వార్తలు