మాస్కు లేదని ఐజీకే జరిమానా.. అయితే,

7 Jun, 2020 18:08 IST|Sakshi

లక్నో: మాస్కు ధరించని కాన్పూర్‌ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ మోహిత్‌ అగర్వాల్‌కు చలాన్‌ తప్పలేదు. అయితే, ఆయనకెవరూ ఫైన్ వేయలేదు. నైతిక విలువలకు కట్టుబడే తనే స్వయంగా చలాన‌ వేయించుకున్నారు. వివరాలు.. తనిఖీలకు వెళ్తున్న క్రమంలో ఐజీ అగర్వాల్‌ తన కార్యాలయం నుంచి కారిడార్‌లోని వాహనం వరకు మాస్కు లేకుండా వచ్చారు. వెంటనే తన తప్పును తెలుసుకుని వాహనంలో ఉన్న మాస్కు పెట్టుకున్నారు. అయినప్పటికీ విధుల్లో ఉన్న సిబ్బందితో చర్చించి... నిబంధనల ప్రకారం తనకు జరిమానా విధించాలని చెప్పారు.

దాంతో వారు ఐజీకి రూ.100 చలాన్ విధించారు. దీనిపై అగర్వాల్‌ మాట్లాడుతూ..  ‘విధుల్లో భాగంగా బయటికి వెళ్తున్న సమయంలో మాస్కు లేకుండా బయటికొచ్చా. కానీ, నా తప్పిదాన్ని సిబ్బంది తెలియజేశారు. దాంతో మరోమాట లేకుండా నిబంధనలు అతిక్రమించినందుకు చలాన్‌ వేయమని చెప్పా. ఆ మొత్తం‌ చెల్లించా. నైతిక విలువలకు కట్టుబడే ఈ పనిచేశా. ఇతరులకు చెప్పే ముందు మనం పాటించాలి కదా అని’ ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. చలాన రశీదు ఫొటో పెట్టారు. కాగా, కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మాస్కు లేనిదే బయట తిరిగితే రూ.100 ఫైన్‌ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఇక ఐజీ చర్యపై ట్విటర్‌లోప్రశంసలు కురుస్తున్నాయి.

మరిన్ని వార్తలు