కుక్కను మేక అని నమ్మించి...

22 Aug, 2018 20:25 IST|Sakshi

కాన్పూర్‌ (ఉత్తరప్రదేశ్‌): ఓ వ్యక్తి దగ్గర ఉన్న మేకను దొంగిలించాలని భావించిన కొందరు దొంగలు.. అది మేక కాదు కుక్క అని చెప్పి ఆ వ్యక్తిని నమ్మిస్తారు. దొంగల మాటలు నమ్మిన ఆ వ్యక్తి మేకను కుక్కగా భావించి దాన్ని వదిలేసి వెళ్తాడు. ఈ కథ మనందరికీ తెలిసిందే. సరిగ్గా ఇలాంటి మోసపూరిత సంఘటనే ఒకటి కాన్పూర్‌లో జరిగింది. కుక్కను మేక అని నమ్మించి దుండగుడు ఓ అమాయకుడిని బురడీ కొట్టించాడు. పది వేల రూపాయలు విలువ చేసే మేకను ఎత్తుకుపోయాడు.

వివరాల ప్రకారం.. కాన్పూర్‌కు చెందిన అశ్రఫ్‌ బక్రీద్‌ పర్వదినం సందర్భంగా తన దగ్గర ఉన్న మూడు నల్ల మేకలను అమ్మడానికి స్థానిక సంతకు తీసుకెళ్లాడు. రెండు మేకలను అమ్మాడు. మూడో మేకను ఒక దగ్గర కట్టేసి.. దాన్ని అమ్మడం కోసం సంతంతా తిరుగుతున్నాడు. అయితే ఇంతలో ఒక వ్యక్తి అశ్రఫ్‌ దగ్గరకు వచ్చి నీ మేక తప్పించుకుని నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను ఓ  చోట కట్టేశాను, వెళ్లి ఆ మేకను తెచ్చుకోమని చెప్పాడు.

ఆ విషయం విన్న అశ్రఫ్‌, ఆ వ్యక్తి చెప్పిన మాటలను నిర్ధారించుకోకుండా, సరాసరి ఆ వ్యక్తి చెప్పిన చోటకే వెళ్లాడు. అక్కడ మొహం కనపడకుండా పూలతో అలంకరించిన ఒక నల్ల జంతువును చూశాడు. అయితే అశ్రఫ్‌ ఏ తాడుతో తన మేకను కట్టేసాడో అచ్చం అలాంటి తాడుతోనే ఆ నల్ల జంతువును కూడా కట్టి వేసి ఉంచాడు దుండగుడు. దాంతో అశ్రఫ్‌ దాన్ని తన మేకగానే భావించి వెళ్లి తాడు విప్పడానికి ప్రయత్నించాడు. అంతే ఆ మేక కాస్తా మొరగడం ప్రారంభించింది.

మేక మొరగడమేంటి అనుకుంటున్నారా.. ఎందుకంటే అది మేక కాదు.. కుక్క కాబట్టి మొరిగింది. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న అశ్రఫ్‌ ప్రారంభంలో తన మేకను కట్టివేసిన ప్రదేశానికి వెళ్లాడు. కానీ అక్కడ అశ్రఫ్‌ మేక లేదు.  మేక తప్పించుకు పోయిందని చెప్పిన వ్యక్తి తనని బురిడి కొట్టించి మేకను దొంగలించాడని అశ్రఫ్‌కు అర్ధమయ్యింది. దాంతో ఈ విషయం గురించి అక్కడ మార్కెట్‌ అధికారులకు చెప్పి సాయం చేయమని కోరారు. కానీ వారు అశ్రఫ్‌ అమాయకత్వానికి నవ్వడంతో అవమానం భరించలేని అశ్రఫ్‌ అక్కడ నుంచి వెళ్లి పోయాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు