గ్యాంగ్‌స్టర్‌ మరణంతో గ్రామంలో సం‍బరాలు

10 Jul, 2020 12:22 IST|Sakshi

కుప్పకూలిన నేర సామ్రాజ్యం

లక్నో : గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే మరణ వార్తను విన్న ఆయన స్వస్థలం కాన్పూర్‌కు సమీపంలోని బిక్రూ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వికాస్‌ దూబే అరాచకాలకు ఇప్పటికి తెరపడిందని వారు సంబరపడుతున్నారు. తమకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గ్యాంగ్‌స్టర్‌ పోలీసుల చేతిలో మరణించాడని తెలుసుకుని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామంలో తనను అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన ఎనిమిది మంది పోలీసులను గ్యాంగ్‌స్టర్‌ దూబే, ఆయన సహచరులు పొట్టనపెట్టుకోవడాన్ని గ్రామస్తులు, సైనికులు గుర్తుచేసుకున్నారు. దూబే అరాచకాలకు తామంతా బాధితులమేనని స్ధానికులు, ఇరుగుపొరుగు వారు వాపోయారు. గతంలో గ్యాంగ్‌స్టర్‌ వేధింపులపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని 2013లో ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసినా ఎలాంటి ఫలితం లేదని స్ధానికులు చెప్పుకొచ్చారు. (వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్: అనేక అనుమానాలు!)

వికాస్‌ దూబే నేరసామ్రాజ్యం బలహీనపడటం తాము ఎన్నడూ చూడలేదని.. పలువురు రాజకీయ నేతలు ఆయనకు సహకరించేవారని గుర్తుచేసుకున్నారు. ఓ మాజీ మహిళా ఎమ్మెల్యే దూబేకు రాఖీ కట్టి ఆయన తనకు సోదరుడని చెప్పుకున్నారని తెలిపారు. దూబే చిన్నపాటి విషయాలకే తమ తండ్రులు, బంధువులను దారుణంగా కొట్టేవారని, గ్యాంగ్‌స్టర్‌ ఆయన మనుషులు తమ వీధి వెంట వెళ్లే సమయంలో తాము తలపైకి ఎత్తరాదని, వారికి నమస్తేలు పెట్టడం​ తప్పనిసరని స్ధానికులు చెప్పుకొచ్చారు. గ్యాంగ్‌స్టర్‌ పీడ విరగడైన ఈ రోజు తమకు పండుగ రోజు కంటే తక్కువేమీ కాదని సంతోషం వ్యక్తం చేశారు.చివరికి అరాచక శకం ముగిసిందని, భగవంతుడు తమ ప్రార్ధనలను విన్నాడని అన్నారు. రౌడీషీడర్‌పై తాము పోలీసులు, మంత్రులకు ఇచ్చిన ఫిర్యాదులు, వినతిపత్రాల కాపీలను వారు ఓ జాతీయ వెబ్‌సైట్‌కు చూపారు.


  
గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ అతడిని ఈరోజు ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా.. పోలీసుల ఎస్కార్ట్‌లోని ఆ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్‌ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని కాన్పూర్‌ ఆస్పత్రికి తరలించగా అతడు మరణించాడు. వికాస్‌ దూబేపై హత్య కేసులు సహా మొత్తం 60 క్రిమినల్‌ కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. 20 ఏళ్ల కిందట పోలీస్‌ స్టేషన్‌లో బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేసిన కేసులో వికాస్‌ దూబే నిందితుడు కాగా ఆధారాలు లేకపోవడంతో ఆ కేసు నుంచి గ్యాంగ్‌స్టర్‌ బయటపడ్డాడు.

చదవండి : గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే హతం

>
మరిన్ని వార్తలు