సీబీఐతో సీఎం అవినీతి గుట్టు విప్పుతా!

16 May, 2017 09:28 IST|Sakshi
సీబీఐతో కేజ్రీవాల్ అవినీతి గుట్టు విప్పుతా!

న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు మరిన్ని కష్టాలు ఎదురుకానున్నాయి. ఆరురోజులపాటు కొనసాగించిన నిరాహార దీక్షను ఆప్ బహిష్కృత నేత, మాజీ మంత్రి కపిల్ మిశ్రా సోమవారం సాయంత్రం ముగించారు. అనంతరం కొన్ని కీలక విషయాలపై ఆయన మాట్లాడారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మంగళవారం సీబీఐ, సీబీడీటీ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలను అధికారులకు ఇచ్చి, విచారణ త్వరగా చేపట్టాలని కోరనున్నట్లు చెప్పారు. షెల్ కంపెనీల ద్వారా హవాలా, నల్లధనం, మనీ ల్యాండరింగ్ లాంటి అవినీతికి కేజ్రీవాల్ పాల్పడ్డారని ఫిర్యాదు చేయనున్నట్లు ఇదివరకే ట్వీట్ చేశారు.

అబద్దాల పునాదుపై కట్టిన నిర్మాణం ఎల్లకాలం నిలవదన్నారు. ఇంట్లో ఉండి అసత్యాలు, అబద్దాలను ప్రచారం చేస్తున్నారని కేజ్రీవాల్‌పై మండిపడ్డారు. మే10న ఆప్ సీనియర్ నేతలు అశిష్ ఖేతన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్ధా, దుర్గేష్ పాఠక్, సత్యేంద్ర జైన్‌ల విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను వెల్లడించాలన్న డిమాండ్‌తో కపిల్ మిశ్రా నిరాహార దీక్ష చేపట్టిన విషయం విదితమే. కేజ్రీవాల్‌కు మంత్రి సత్యేంద్రజైన్ రూ.2 కోట్ల లంచం ఇచ్చారని ఇదివరకే సీబీఐకి కపిల్ మిశ్రా ఫిర్యాదు చేశారు. రూ.400 కోట్ల మంచినీటి ట్యాంకర్ల కుంభకోణంలోనూ దర్యాప్తు నివేదికలను కేజ్రీవాల్ తొక్కిపెట్టారని ఆరోపించారు. నేడు సీబీఐ, సీబీడీటీ కార్యాలయాలకు నేరుగా వెళ్లి కేజ్రీవాల్‌ అవినీతిపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు.

>
మరిన్ని వార్తలు