ఓల్డ్‌ మంక్‌ సృష్టికర్త కపిల్‌ మోహన్‌ కన్నుమూత

9 Jan, 2018 13:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ లిక్కర్‌ వ్యాపారి కపిల్‌ మోహన్‌ ఇక లేరు. గుండెపోటుతో శనివారం ఆయన మృతి చెందగా.. ఆ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్‌లోని మోహన్‌ నగర్‌ లోని ఇంట్లో ఆయన మృతి చెందినట్లు సమాచారం.  

మోహ‌న్ మేకిన్ లిమిటెడ్ పేరుతో 1954లో ఓల్డ్ మాంక్ ర‌మ్ సంస్థ‌ను ఆయ‌న నెల‌కొల్పారు. ఓల్డ్ మాంక్‌తో పాటు సోలాన్‌ నెం.1, గోల్డెన్ ఈగ‌ల్ వంటి మ‌రో రెండు బ్రాండుల‌ను కూడా ఆయ‌న సృష్టించారు. ‘డార్క్‌ రమ్‌’గా ఓల్డ్‌ మంక్‌ అమ్మకాలు కొన్నేళ్లపాటు జోరుగా సాగాయి.

స్వ‌త‌హాగా ఎలాంటి మ‌ద్యం తీసుకోని క‌పిల్ మోహ‌న్ లిక్కర్‌ కింగ్‌గా ప్రాచుర్యం పొందినప్పటికీ.. చక్కెర, వస్త్ర పరిశ్రమలను కూడా విజయవంతంగా ముందుకు నడిపించారు. వ్యాపార రంగంలో మోహన్‌ కృషికి గాను కేంద్ర ప్రభుత్వం 2010లో ఆయనను ప‌ద్మ‌శ్రీ పురస్కారంతో స‌త్క‌రించింది. ఆయన అనారోగ్యం బారిన పడటంతో వ్యాపారాన్ని బంధవులకు అప్పగించేశారు. గత కొంత కాలంగా ఓల్డ్‌ మంక్‌ నష్టాల్లో కొట్టుమిట్టాడుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కంపెనీ చరిత్ర...
ఎడ‍్వర్డ్‌ డయ్యర్‌ 1855లో కసౌలిలో తన పేరు మీద బ్రెవెరీ సంస్థను ఏర్పాటు చేశారు. కొంత కాలం తర్వాత మరో లిక్కర్‌ సంస్థ హెచ్‌జీ మెకిన్‌తో చేతులు కలిపి డయ్యర్‌ మెకిన్‌ అండ్‌ కో. లిమిటెడ్‌గా దేశవ్యాప్తంగా వ్యాపారం చేయటం ప్రారంభించాయి. 1935లో బర్మా ఉప ఖండం నుంచి విడిపోగా.. డయ్యర్‌ మెకిన్‌ బ్రెవెరిస్‌ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. కపిల్‌ మోహన్‌ ఆ కంపెనీని హస్తగతం చేసుకున్నాక అది మోహన్‌ మోకిన్‌ బ్రేవరీస్‌ లిమిటెడ్‌(1966-80 మధ్య)గా మారిపోయింది. ఆ తర్వాత కొంత కాలానికే దాని పేరు మోహన్‌ మెకిన్‌ లిమిటెడ్‌గా మార్చేశారు.

మరిన్ని వార్తలు