‘కరాచీ’ హైదరాబాద్‌దే!

24 Feb, 2019 11:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పుల్వామా ఉగ్రదాడితో యావత్‌ భారత్‌ అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే. ఈ దాడి ముమ్మాటికి దాయదీ పాకిస్తాన్‌ జరిపిందేనని ఆ దేశంపై భారత ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, ప్రపంచం ముందు ఒంటరి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ సెగ హైదరాబాద్‌ ఫేమస్‌ కరాచీ బేకరీకి తగిలింది. పాకిస్తాన్‌లోని నగరం పేరిట ఉన్న ఈ బేకరీపై ఆందోళనకారులు బెంగళూరులో దాడి చేశారు. తమది పాక్‌కు సంబంధించిన కంపెనీ కాదని మొత్తుకున్నా ఆందోళనకారులు వినలేదు. దీంతో కరాచీ బేకరీ తమది హైదరాబాద్‌ కంపెనీ అని స్పష్టం చేస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. 

‘దేశ భక్తులందరికీ మనవి.. కరాచీ బేకరీ విషయంలో మేం ఓ విషయాన్ని స్పష్టం చేయదల్చుకున్నాం. కరాచీ బేకరి వ్యవస్థాపకులు ఖాన్‌చంద్‌ రమ్నానీ. దేశ విభజన సమయంలో ఆయన హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఈ కరాచీ బ్రాండ్‌ను 1953లో హైదరాబాద్‌లో ప్రారంభించడం జరిగింది. ఇది పూర్తిగా భారత్‌కు చెందిన తెలంగాణ కంపెనీ. మా ప్రొడక్టులకు వచ్చిన ఆదరణకు అనుగుణంగా మేం మా బ్రాంచ్‌లను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం జరిగింది. కరాచీ బేకరీ ఎప్పుడూ భారత్‌దే. తమ సంస్థపై వచ్చే తప్పుడు ప్రచారన్ని ఒక సారి సమీక్షించుకోండి’  అని  వివరణ ఇస్తూ విజ్ఞప్తి చేసింది.

తొలి బ్రాంచ్‌ ఇక్కడే..
1953లో హైదరాబాద్‌లోని మొజంజాహి మార్కెట్‌లో కరాచీ బేకరి తొలి బ్రాంచ్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా శాఖలను విస్తరించారు. బిస్కెట్లకు కరాచీ బేకరీ ఎంతో ప్రసిద్ధి పొందినది.

మరిన్ని వార్తలు