ఆ 5 రాష్ట్రాల విమానాలు, రైళ్ల రాకపై నిషేధం!

28 May, 2020 18:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయం 

బెంగళూరు: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి రాకపోకలను నిషేధించింది. మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చే విమానాలు, రైళ్లు, ఇతర వాహనాలను రాష్ట్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర కేబినెట్‌ గురువారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో చాలా మందికి వైరస్‌ సోకినట్లు తేలడం సహా వారిని ప్రభుత్వ క్వారంటైన్ చేయడంలో సమస్యలు తలెత్తిన కారణంగానే యడ్డీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.(లాక్‌డౌన్‌ 5.0 : ఆ నగరాలపై ఫోకస్‌)

ఇక కోవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, ​కేరళ నుంచి వచ్చేవారిని మే 31 వరకు రాష్ట్రంలోకి అనుమతించబోమని కర్ణాటక ప్రభుత్వం ఇదివరకే తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. తాజాగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లను కూడా ఈ జాబితాలో చేర్చింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 2283 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 44 కోవిడ్‌ మరణాలు సంభవించినట్లు సమాచారం.(చదవండి: ఐదు విమానాల్లో 900 మంది..)

మరిన్ని వార్తలు