ఓలా, ఉబెర్‌కు ఓకే.. ఆ 4 రాష్ట్రాల ప్రయాణీకులపై నిషేధం!

18 May, 2020 15:09 IST|Sakshi

లాక్‌డౌన్‌ పొడిగింపు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రతీ ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

బస్సులతో పాటు ఓలా, ఉబెర్‌ సర్వీసులకు ఓకే

బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, ​కేరళ నుంచి వచ్చేవారిని మే 31 వరకు రాష్ట్రంలోకి అనుమతించబోమని తేల్చిచెప్పింది. ఆయా రాష్ట్రాల నుంచి ప్రయాణీకుల రాకపోకలపై నిషేధం విధించింది. మహమ్మారి కోవిడ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో మే 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నాలుగో విడత లాక్‌డౌన్‌లో పలు నిబంధనలు సడలించిన కేంద్రం... కంటైన్మెంట్‌ జోన్లు మినహా.. అంతరాష్ట్ర, ఇతర రాష్ట్రాల ప్రయాణాలకు అనుమతినిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే రాష్ట్రాల మధ్య పరస్పర అనుమతితోనే ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. (మే 31 దాకా లాక్‌డౌన్‌: కొత్త నిబంధనలు ఇవే!)

ఈ నేపథ్యంలో మంత్రులు, సీనియర్‌ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ఈ మేరకు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులో భాగంగా కంటైన్మెంట్‌ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ప్రభుత్వ బస్సులు నడిపేందుకు అనుమతినిచ్చారు. అయితే సామాజిక ఎడబాటు నిబంధనలు అనుసరించి బస్సులో కేవలం 30 మంది మాత్రమే ప్రయాణించే వెసలుబాటు కల్పించినట్లు తెలిపారు. అంతేగాకుండా రాష్ట్రంలో ఓలా, ఉబెర్‌ కంపెనీలు మంగళవారం నుంచి టాక్సీలు నడుపవచ్చని పేర్కొన్నారు. ఇక విదేశాల నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.(ఆ రైలు ఇకపై ఇక్కడ ఆగదు: సీఎం)

కాగా కర్ణాటకలో ప్రతీ ఆదివారం లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని డిప్యూటీ సీఎం అశ్వథ్‌ నారాయణ్‌ తెలిపారు. ఆదివారాల్లో ఎటువంటి సడలింపులు ఉండవని.. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. అదే విధంగా మంగళవారం నుంచి పార్కులు తెరుచుకుంటాయని పేర్కొన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలోని షాపులు, మాల్స్‌, విద్యా సంస్థలు, జిమ్‌లు, స్విమ్మింగ​ పూల్‌, ఫిట్‌నెస్‌ సెంటర్లు తెరవబోమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా కర్ణాటకలో ఇప్పటివరకు దాదాపు 1231 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.(లాక్‌డౌన్‌ : కేంద్రం కీలక ఆదేశాలు)

మరిన్ని వార్తలు