లాక్‌డౌన్‌ ఉల్లంఘించి.. బీజేపీ ఎమ్మెల్యే బర్త్‌డే పార్టీ

11 Apr, 2020 09:10 IST|Sakshi

బెంగళూరు : దేశంలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేస్తున్నా.. మరోవైపు నిబంధనలను అతిక్రమిస్తూనే ఉన్నారు. పని ఉన్నా లేకున్నా అనవసరంగా రోడ్లపైకి వచ్చి తిరుగుతూ. నానా హంగామా చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం నొక్కి చెబుతునప్పటికీ ప్రజలు చెవినకెక్కించుకోవడం లేదు. లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలు గుమిగూడి వివాహాలు, వేడుకలు, వినోదాలకు దూరంగా ఉన్నాలని ప్రభుత్వం తెలియజేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ నిబంధనలు అతిక‍్రమిస్తున్నారు. సాధారణ ప్రజలతోపాటు ఈ జాబితాలోకి రాజకీయ నాయకులు కూడా చేరిపోయారు. తాజాగా కర్ణాటకలోని ఓ బీజేపీ ఎమ్మెల్యే తన పుట్టినరోజును అనేకమంది గ్రామస్తుల సమక్షంలో జరుపుకున్నారు. (కరోనాపై పోరులో చిరంజీవి తల్లి )

తుమకూరు జిల్లా తురువెకెరె నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం జయరామ్‌ గుబ్బి ప్రాంతంలో శుక్రవారం పుట్టిన రోజును జరుపుకున్నారు. స్థానికుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకకు కరోనాకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. అంతేగాక అందరి సమక్షంలో కేక్‌ కట్‌ చేసి, అనంతరం వారికి బిర్యానీతో విందును ఏర్పాటు చేశారు. దీంతో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో నిబంధనలు పాటించని బీజేపీ ఎమ్మెల్యే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కర్ణాటకలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. గత నెలలో ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప సైతం ఓ పెళ్లికి హాజరై విమర్శలు ఎదుర్కొన్నారు. (‘అమెరికా పౌరులను అడ్డుకుంటే చర్యలు తప్పవు’)

ప్రస్తుతం కర్ణాటకలో 200కు పైగా కరోనా కేసులు నమోదవ్వగా.. ఆరుగురు మరణించారు. కాగా​ మూడు వారాలపాటు విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే అంతిమ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీని సంప్రదించిన తర్వాతే  ముఖ్యమంత్రి యడియూరప్ప ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక దేశంలో మొత్తం కరోనా కేసులు 6761కు చేరగా.. 206 మంది మృత్యువాత పడ్డారు. (కరోనా: ఒకే ఇంట్లో ఐదుగురికి సోకిన వైరస్‌   )

మరిన్ని వార్తలు