ఈసీ, ఐటీ వేధింపులపై సీఎం ఫైర్‌

5 Apr, 2019 12:45 IST|Sakshi

సాక్షి, బెంగళూర్‌ : కర్నాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఈసీ, ఆదాయ పన్ను శాఖలపై విరుచుకుపడ్డారు. ఈ రెండు వ్యవస్థలు తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. ఈసీ అధికారులు సీఎం రేంజ్‌ రోవర్‌ కారును, ఆయన కాన్వాయ్‌ను తనిఖీల నిమిత్తం నిలిపివేసిన నేపథ్యంలో కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఈసీ అధికారులు వారి విధి నిర్వహణను నిరాటంకంగా చేపట్టవచ్చని, అయితే కేవలం అనుమానాలున్నాయనే సాకుతో తమను వేధించడం తగదని ఆయన పేర్కొన్నారు. కాగా, సీఎం కుమారస్వామి బుధవారం హసన్‌ వెళుతుండగా, ఈసీ నిఘా బృందం హైవేపై సీఎం కారుతో పాటు కాన్వాయ్‌ను అడ్డగించి తనఖీలు నిర్వహించింది. మరోవైపు వాహన తనిఖీల్లో ఈసీకి ఏమీ పట్టుబడలేదని సమాచారం. బెంగళూర్‌-హసన్‌ హైవేపై తాము రోజూ రాజకీయ పార్టీలు, నేతలు, అభ్యర్ధుల వాహనాలను తనిఖీ చేసి ఎన్నికల నియమావళి అమలవుతున్న తీరును పరిశీలిస్తామని, ఇదే ప్రక్రియలో సీఎం కాన్వాయ్‌ను తనిఖీ చేశామని ఈసీ అధికారి ఎన్‌ఎస్‌ దర్శన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు