సిద్ధూ సీటుకు ఎసరు?

27 Apr, 2016 15:09 IST|Sakshi
సిద్ధూ సీటుకు ఎసరు?

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీటు కిందకు నీళ్లు వస్తున్నాయా? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. తన పీఠం కదలం ఖాయమని ఆయనకు కూడా తెలిసిపోయినట్టుంది. గత కొద్ది వారాలుగా ప్రతిఒక్కరితో తాను రాష్ట్ర ముఖ్యమంత్రినని, పూర్తి కాలం పదవిలో కొనసాగుతానని సిద్ధరామయ్య చెబుతున్నారు. తన మంత్రులతో కూడా ప్రకటనలు ఇప్పిస్తున్నారు. పరిస్థితి ఆయనకు అర్థమైనట్టు కనబడుతోంది.

కాంగ్రెస్ అధిష్టానం సిద్ధూ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంది. వరుస వివాదాలతో సతమవుతున్న సిద్ధూను సాగనంపేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా తన కుమారుడి కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.అంతకుముందు లక్షల ఖరీదు చేసే వాచీని ధరించి వివాదంలో చిక్కుకున్నారు. 32 నెలల పాలనలో తన విమానయాన ప్రయాణాలకు రూ.20,11,34,971 ఖర్చు చేసి సిద్దూ విమర్శలు పాలయ్యారు.

సిద్ధరామయ్య  వారసుడెవరన్న దానిపై కర్ణాటక రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. సిద్ధూకు ఉద్వాసన పలికితే సీఎం ఛాన్స్  దక్కే అవకాశముందంటూ ఇద్దరు పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ముందజలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. హస్తినలో ఆయన ఇప్పటికే లాబీయింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. గతవారం ఢిల్లీలో అధినేత్రి సోనియా గాంధీ దర్శనం చేసుకున్న ఆయన పనిలో పనిగా తన కోరికను 'మేడమ్' చెవిన వేశారట.

అయితే దళిత నాయకుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడితే ఎలా ఉంటుందని కూడా హస్తిన పెద్దలు ఆలోచన చేస్తున్నారు. దళితుడిని సీఎం చేయాలనుకుంటే కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వరకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. పరమేశ్వర కూడా గతవారం ఢిల్లీలో సోనియమ్మను కలిశారు. వక్కలింగ సామాజిక వర్గానికి చెందిన ఎస్ఎం కృష్ణకు వయోభారం మైనస్ గా మారింది.

ఈ నెల 23న 'మేడమ్'ను కలవాలని సిద్ధరామయ్య అనుకున్నా ఆమె కుదరదని చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు. సిద్ధూ స్థానంలో మల్లిఖార్జున ఖర్గేను సీఎంను చేస్తే బాగుంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఖర్గే అవసరం బెంగళూరు కంటే ఢిల్లీకే ఎక్కువ ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మే 15 -20 మధ్య కర్ణాటక సీఎంను మార్చడం ఖాయమని సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. పదవీ గండం నుంచి సిద్ధరామయ్య బయటపడతారో, లేదో చూడాలి.

మరిన్ని వార్తలు