చొక్కా కోసం కోర్టుకెళ్లిన బాలుడు

31 Aug, 2019 08:51 IST|Sakshi

విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్, షూ, సాక్సులు ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు

కర్ణాటక సర్కారు కళ్లు తెరిపించిన బాలుడి న్యాయ పోరాటం

సాక్షి, బళ్లారి: పేదరికంలో మగ్గుతున్న ఓ విద్యార్థి తనకు కష్టం వచ్చిందని బాధపడుతూ కూర్చోలేదు. హక్కుల కోసం న్యాయస్థానం తలుపు తట్టాడు. కొప్పళ తాలూకా కిన్నాళ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థి మంజునాథ్‌ ఓ రోజు పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. తాను ధరించిన చొక్కా అపరిశుభ్రంగా ఉంది. మరో చొక్కా వేసుకుందామంటే అదీ చిరిగిపోయింది. ప్రభుత్వం విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్‌ పంపిణీ చేయాల్సి ఉండగా.. ఒక జత మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంది. దీంతో మంజునాథ్‌ యూనిఫామ్‌ పంపిణీలో ప్రభుత్వ జాప్యాన్ని, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించకూడదని తండ్రిని అడిగాడు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించవచ్చని.. కోర్టుకు సైతం వెళ్లవచ్చని తండ్రి దేవరాజ్‌ చెప్పాడు. కుమారుడిని హైకోర్టు న్యాయవాది అజిత్‌ వద్దకు తీసుకెళ్లి విషయం తెలిపాడు. దీనిపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయొచ్చని న్యాయవాది సలహా ఇవ్వడంతో విద్యార్థి మంజునాథ్‌ ఈ ఏడాది మార్చి 25న రిట్‌ వేశాడు. 

విచారణకు స్వీకరించిన హైకోర్టు ›ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎస్‌ ఓకా, జస్టిస్‌ మహమ్మద్‌ నవాజ్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ సుదీర్ఘంగా విచారించి గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఆర్‌టీఈ (రైట్‌ టు ఎడ్యుకేషన్‌) యాక్ట్‌ ప్రకారం రెండు నెలల్లోపు యూనిఫామ్‌తోపాటు షూ, సాక్సులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. కేసు వేసిన విద్యార్థికి రెండు వారాల్లోపు రెండు జతల యూనిఫామ్, షూ, సాక్సులు ఇవ్వాలని కోర్టు ప్రత్యేకంగా సూచించింది. కోర్టు తీర్పు అనంతరం బాలుడు మంజునాథ్‌ మాట్లాడుతూ తన అర్జీపై హైకోర్టు స్పందించి ఆదేశాలు ఇవ్వడం సంతోషం కలిగించిందన్నాడు. తన పోరాటానికి తండ్రి దేవరాజ్‌ సహకారం ఇవ్వడం వల్లే విజయం సాధించానని చెప్పాడు. 

మరిన్ని వార్తలు