క్లర్క్‌ ఔదార్యం.. 45 మంది జీవితాల్లో వెలుగు

30 Jul, 2018 11:58 IST|Sakshi
పాఠశాల విద్యార్ధులతో బసవరాజ్‌

బెంగళూరు : ‘అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పద’ని నానుడి. కానీ నేటి కాలంలో అన్నదానం కన్నా విద్యాదానమే గొప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక పూట భోజనం పెట్టి కడుపు నింపే కన్నా జీవితాంతం కడుపు నింపుకునేందుకు కావాల్సిన ఉపాధిని చూపే, విద్యను దానం చేస్తే వారికి మాత్రమే కాక మరో పది మందికి కూడా సాయం చేసిన వారు అవుతారు. కానీ ఇందుకోసం ముందుకు వచ్చేవారు చాలా అరుదు. కోట్ల కొద్ది సంపద ఉన్న వారు కూడా ఇలాంటి సాయం చేయడానికి ముందుకు రారు.

కానీ కర్ణాటక కలబుర్గి పట్టణానికి చెందిన ఒక గుమస్తా ఇలాంటి వారందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వచ్చే జీతం కొంచమే అయినా దానితోనే 45 మంది పేద విద్యార్ధుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. వివరాల ప్రకారం.. కలబుర్గి, మక్తాంపురాకు చెందిన బసవరాజ్‌ స్థానిక మండల్‌ పరిషత్‌ హై స్కూల్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. బసవరాజ్‌ కుమార్తె ధనేశ్వరి అనారోగ్య కారణాల వల్ల ఏడాది క్రితం మరణించింది. దాంతో కూతురు జ్ఞాపకార్థం ఓ 45 మంది ఆడపిల్లలకు పాఠశాల ఫీజులు చెల్లిస్తున్నారు బసవరాజ్‌.

ఈ విషయం గురించి ఫాతిమా అనే విద్యార్ధి చెబుతూ ‘మేము చాలా పేద కుటుంబానికి చెందిన వాళ్లం. పాఠశాల ఫీజు చెల్లించడం మాకు చాలా కష్టం. కానీ బసవరాజ్‌ సార్‌ మా కష్టాన్ని తొలగించారు. ఇందుకు మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సార్‌ చేస్తున్న సాయం చూసి ఆయన కూతురు ఆత్మ ఎంతో సంతోషిస్తుంటుంది’ అని తెలిపారు.  ​   

మరిన్ని వార్తలు