కొంచెం కట్టడి

27 Mar, 2020 07:52 IST|Sakshi
కొప్పళలో రోడ్డు మీదకు వచ్చిన చిరువ్యాపారిపై పోలీసు లాఠీ దెబ్బ

తగ్గిన కరోనా కేసులు కొత్తగా 4 నమోదు

మైసూరులో ప్రైవేటు ఉద్యోగికి వైరస్‌  

చిక్కబళ్లాపుర మహిళ మృత్యువాత  

ఫ్రాన్స్, బెంగళూరువాసికి గుర్తింపు  

రాష్ట్రమంతటా పటిష్టంగా లాక్‌డౌన్‌  

సాక్షి, బెంగళూరు:   కరోనా వైరస్‌ కేసులు గురువారం కొంతమేర తగ్గుముఖం పట్టాయి. రోజూ ఏడెనిమిదికి పైగా కేసులు నమోదవుతూ రాగా, గురువారం నాలుగు పాజిటివ్‌లు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 55కు పెరిగాయి. 50 మంది రోగులను వివిధ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మొత్తం కేసుల్లో ఆరుమంది కేరళ నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇప్పటివరకుబెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు 89,963 మందిని, మంగళూరు విమానాశ్రయంలో 31,971 మందిని పరీక్షించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1,28,046 మందికి స్క్రీనింగ్‌పరీక్షలు జరిపారు. 172 మంది అనుమానితులకు ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. బయటకు వచ్చినవారిపై ఖాకీలు లాఠీచార్జీలు చేయడం, మందలించడం వంటి ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.  

కొత్తగా కేసులు వివరాలు  
52వ రోగి – మైసూరు నగరానికి చెందిన 35  ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్‌ నిర్ధారణ అయింది. ఇతడు నంజనగూడులోని ఫార్మసూటికల్‌ కంపెనీకి చెందిన చాలా మంది హెల్త్‌కేర్‌ నిపుణులతో కలసినట్లు తెలిసింది. ఎవరెవరిని కలిశాడు అనేది విచారిస్తున్నారు.  
52వ రోగి – చిక్కబళ్లాపురకు చెందిన 70 ఏళ్ల వృద్ధ మహిళకు కరోనా వైరస్‌ సోకి మరణించినట్లు నిర్ధారణ అయింది. అంతేకాకుండా కరోనాతో మరణించిన రెండు కేసుగా ప్రభుత్వం నిర్ధారించింది. మార్చి 14న సౌదీ అరేబియాలోని మక్కాకు వెళ్లి తిరిగి వచ్చింది. 24వ తేదీన బెంగళూరులోని
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య ఆమె అంత్యక్రియలు జరిగాయి.  
54వ రోగి – ప్రాన్స్‌కు చెందిన 64 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు ధ్రువీకరించారు. అతడు ఈ నెల 1న ఇండియాకు వచ్చాడు. ఆ తర్వాత కూడా హిమాచల్‌ ప్రదేశ్, పుట్టపర్తిలో తిరిగి ఈ నెల 21న బెంగళూరుకు చేరుకున్నాడు. బెంగళూరు గ్రామీణంలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.  
55వ రోగి – బెంగళూరుకు చెందిన 45ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్‌ సోకింది. ఇతడు 25వ కరోనా వైరస్‌ సోకిన రోగికి (సెక్యురిటీ గార్డు) సన్నిహితంగా మెలిగాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.   

బయటకి వస్తే అరెస్టు చేయండి : కలెక్టర్లకు సీఎం ఆదేశం
కరోనా లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి రోడ్ల మీదికి వచ్చేవారిని అరెస్టు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం యడియూరప్ప ఆదేశించారు. విధానసౌధలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం యడియూరప్ప వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కరోనా నివారణ చర్యలపై చర్చించారు. లాక్‌డౌన్‌ను మీరి బయటకు వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై ఉల్లంఘనులను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయాలి. రాష్ట్రంలోని అన్ని సరిహద్దులను మూసేయాలి. కాసరగోడు, దక్షిణ కన్నడ జిల్లాలు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.  కాసరగోడు నుంచి వచ్చే వారిని అడ్డుకోండి. ప్రైవేటు క్లినిక్‌లను మూసేయకుండా చూడాలి. జిల్లాల్లో కోవిడ్‌–19 రోగుల కోసం ఆస్పత్రుల్లో 50 పడకలను సిద్ధం చేసి ఉంచాలి. నిత్యవసరాల వస్తువుల ధరలను పెంచకుండా చూడాలి. ధరలు పెంచే వ్యాపారులను ఉపేక్షించవద్దు అని సీఎం సూచించారు. 

మరిన్ని వార్తలు