అప్పు తీర్చడం కోసం రైతును 15కిలోమీటర్లు నడిపించారు

27 Jun, 2020 14:57 IST|Sakshi

బెంగళూరు: వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి.. దేశాలు దాటి పోతున్న బడా బాబుల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉండే బ్యాంకులు.. రైతుల విషయానికి వస్తే మాత్రం ఎక్కడా లేని రూల్స్‌ మాట్లాడతాయి. పాత బాకీ చెల్లించకపోతే.. కొత్తగా రుణం మంజూరు చేయవు. అప్పు వసూలు చేయడం కోసం నోటీసులు పంపడం.. చివరికి ఆస్తుల్ని వేలం వేయడం వంటి సంఘటనలు కోకొల్లలు. ఈ క్రమంలో వేల కోట్లు ఎగ్గొట్టిన వారిని వదిలేసి.. కేవలం మూడున్నర రూపాయల(3రూపాయల 46 పైసలు) అప్పు తీర్చడం కోసం ఓ రైతును ఏకంగా 15 కిలోమీటర్లు నడిపించారు బ్యాంకు అధికారులు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం షిమోగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న బారువే గ్రామంలో జరిగింది. 

వివరాలు..  బారువే గ్రామానికి చెందిన అమాదే లక్ష్మీనారాయణ అనే రైతు వక్కలు పండిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో సమీప పట్టణం నిత్తూరులో ఉన్న కెనరా బ్యాంక్‌లో రూ. 35 వేల వ్యవసాయ రుణం తీసుకున్నాడు. అయితే ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో రూ.32 వేలు మాఫీ అయ్యింది. మిగిలిన రూ.3 వేలు లక్ష్మీ నారాయణ చెల్లించాడు. రుణం మొత్తం తీరింది. మళ్ళీ అప్పు తీసుకోవచ్చు అనుకున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు లక్ష్మీ నారాయణకు బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. అప్పు మొత్తం తీరలేదని వెంటనే బ్యాంక్‌కు రావాలని అధికారులు అతడికి ఫోన్‌ చేశారు. కంగారు పడిన లక్ష్మీ నారాయణ బ్యాంకుకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆయన గ్రామానికి బస్సులు రావడం లేదు. దాంతో నడుచుకుంటూ 15కిలోమీటర్ల దూరానా ఉన్న బ్యాంకుకు వెళ్ళాడు. 

తీరా అక్కడికి వెళ్లాకా బ్యాంకు అధికారి లక్ష్మీ నారాయణ పేరు మీద రూ. 3.46 పైసల అప్పు ఉందని చెప్పడంతో షాక్ అయ్యాడు. ఈ మాత్రం అప్పు కోసం తనను ఏకంగా 15 కిలోమీటర్లు నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బకాయి సొమ్ము చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై బ్యాంకు మేనేజర్ ఎల్ పింగ్వా స్పందిస్తూ.. కొత్తగా మళ్లీ అప్పు ఇవ్వడానికి వీలవుతుందనే ఉద్దేశంతోనే బ్యాలెన్స్‌ రూ.3.46 పైసలు అడిగినట్లు తెలిపాడు. అయితే బ్యాంకు అధికారుల తీరు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల దగ్గర మాత్రమే కాక అందరి దగ్గర ఇలానే అప్పు వసూలు చేస్తే ఎంతో బాగుంటుందని అంటున్నారు.
 

మరిన్ని వార్తలు