సీఏఏ : యూపీ దారిలో కర్ణాటక

27 Dec, 2019 13:36 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : నిరసనల సందర్భంగా ఎవరైనా ప్రజా ఆస్థుల విధ్వంసానికి పాల్పడితే జరిగిన నష్టాన్ని వారి వద్దనుంచే వసూలు చేసే యూపీ తరహా చట్టాన్ని కర్ణాటకలో కూడా తెస్తామని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అశోకా గురువారం వెల్లడించారు. యూపీలో తెచ్చిన నూతన చట్టం ప్రకారం ఇప్పటికే ఆందోళనకారుల ఆస్థులు జప్తు చేస్తూ చాలా మందికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిరసనల సందర్భంగా యూపీలో నెలకొన్న హింసాత్మక పరిస్థితే మంగూళూరులో కూడా ఉత్పన్నమైనందున యూపీ ప్రభుత్వ మార్గంలో నడవాలని నిర్ణయించినట్టు మంత్రి గురువారం తెలిపారు.

ఈ విషయంపై మరో మంత్రి సీటీ రవి మాట్లాడుతూ.. నష్టాన్ని ఆందోళనకారులకు జరిమానా విధించి భర్తీ చేయడమే కాకుండా వారిపై గూండా చట్టం ప్రకారం కేసులు పెట్టాలని, ఇలా అయితేనే వ్యవస్థీకృత నేరాలను అరికట్టవచ్చని సూచించారు. కన్నడ బీజేపీ ఎంపీ శోభా కరాండ్లేజ్‌ మాట్లాడుతూ.. పౌరులు శాంతియుతంగా నిరసన తెలపాలి. అంతేకానీ ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తే మాత్రం జరిగిన నష్టాన్ని భరించాల్సిందేనని పేర్కొన్నారు. కాగా, గత వారం సీఏఏకు వ్యతిరేకంగా మంగుళూరులో జరిగిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ఆయా సంఘటనలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. దాదాపు 1500 నుంచి 2వేల మంది ఆందోళనకారులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో గుమిగూడారు. పోలీసులు ఎంత చెదరగొట్టినా చెదరకపోగా, పోలీసులపైనే రాళ్లు విసిరారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లో కాల్పులు జరిపినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో​ ఇద్దరు పౌరులు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై విమర్శలు రావడంతో మృతులకు నష్టపరిహారంగా ముఖ్యమంత్రి యడ్డియూరప్ప చెరో రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అనంతరం ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకొని మృతుల తప్పిదం లేదని విచారణలో తేలితేనే పరిహారం ఇస్తామని తేల్చిచెప్పారు. అనంతరం కాల్పుల ఘటనపై సీఐడీ, మెజిస్ట్రీయల్‌ విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉండగా, ఎఫ్‌ఐఆర్‌ దాఖలు కావడంతో పోలీసులు పలు ఆధారాలను సేకరించారు. ముసుగు వేసుకున్న పురుషులు సీసీకెమెరాలను ధ్వంసం చేయడం, రోడ్లను దిగ్భంధం చేయడం, వ్యాన్లను ధ్వంసం చేయడం, పోలీసులపై రాళ్లు రువ్వడం వంటి వీడియో ఇప్పటికే సేకరించారు. చదవండి :సీఏఏ: ఉక్కుపాదం మోపిన యూపీ ప్రభుత్వం

మరిన్ని వార్తలు