కర్ణాటక మాజీ డీజీపీ వివాదాస్పద వ్యాఖ్యలు

16 Mar, 2018 10:09 IST|Sakshi
చిత్రంలో హెచ్‌టీ సంగ్లియానా(ఎడమ చివర్లో) నిర్భయ తల్లి ఆశాదేవి (కుడివైపు చివర)

సాక్షి, బెంగళూరు :  దేశరాజధాని నడిబొడ్డున జరిగిన నిర్భయ ఘటనను ప్రజలు ఇంకా పూర్తిగా మర్చిపోలేదు. మానవ మృగాలు 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిని బస్సులో కిరాతకంగా అత్యాచారం చేయగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిర్భయ తల్లి ఆశాదేవి లైంగిక దాడుల్లో కఠిన చట్టాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటక రిటైర్డ్‌ అధికారి ఒకరు నిర్భయ తల్లి ఆశాదేవిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

వివరాల్లోకి వెళ్తే... స్త్రీలను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి కర్ణాటక మాజీ డీజీపీ హెచ్‌టీ సంగ్లియానాను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ‘నిర్భయ’ తల్లి ఆశా దేవి కూడా వచ్చారు. సంగ్లియానాను వేదిక మీదకు ఆహ్వానించి మాట్లాడాల్సిందిగా కోరారు. ఆ సమయంలో ఈ ఉన్నతాధికారి తాను ఎక్కడ ఉన్నది, ఎందుకు వేదిక మీదకు వచ్చిందనే విషయం మర్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నిర్భయ తల్లిని చూశాను. ఆమె చక్కగా, అందంగా ఉన్నారు. తల్లే ఇంత అందంగా ఉంటే ఇక నిర్భయ ఎంత అందంగా ఉండేదో నేను ఊహించగలను’ అన్నారు.

అంతేకాకుండా కార్యక్రమానికి వచ్చిన వారికి కొన్ని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. ‘మీరు ఎంత బలవంతులైనా సరే.. రేపిస్టులకు లొంగిపోవాల్సిందే. అలా అయితేనే మీరు, మీ జీవితాలు సురక్షితంగా ఉంటాయి, ఈ మాటలు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి’ అంటూ వ్యాఖ్యానించారు. సంగ్లియానా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ మహిళ సంఘాలు ధర్నా చేపట్టాయి.


 

మరిన్ని వార్తలు