పొగరాయుళ్లకు చెక్‌: నో మోర్‌ లూజ్‌ సిగరెట్స్‌

28 Sep, 2017 14:51 IST|Sakshi

బెంగళూరు: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే పొగరాయుళ్లకు చెక్‌పెడుతూ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  సిగరెట్లతో పాటు వివిధ రకాల పొగాకు ఉత్పత్తులను విడిగా విక్రయించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ధూమపానాన్ని నిషేధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.  ఆరోగ్యం,  కుటుంబ సంక్షేమ శాఖ  సెక్రటరీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం  లూజ్‌ సిగరెట్లు, బీడీలు  ఇతర చూయింగ్‌ పొగాకు  ఉత్పత్తుల  విక్రయం ఇకమీదట నేరంగా పరిగణిస్తారు.  2003  కోప్టా చట్టంలోని సెక్షన్లు 7, 8  ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది.  

తాజా ఆదేశాల ప్రకారం... సిగరెట్లను పెట్టెగానే విక్రయాలి. విడిగా అమ్మడం కుదరదు. విడిగా విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ శాలిని రాజేష్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధంతో  ధూమపానం  తగ్గినప్పటికీ   లూజ్‌ సిగరెట్లు, బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు.   ఈ నిషేధం పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని  మరింత తగ్గిస్తుందని తాము భావిస్తున్నాన్నారు.

సెప్టెంబరు 11 న ఈ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం  బుధవారంనుంచి ఈ నిషేధాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఈ  ఆదేశాల పటిష్ట అమలుకోసం ఒక ప్రభుత్వం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోందని యాంటీ టొబాకో సెల్లోని  సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

మరిన్ని వార్తలు