కర్ణాటక మంత్రి భౌతిక దూరం ఉల్లంఘన

2 Jun, 2020 19:12 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కరోనా నివారించడానికి కేం‍ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని, ముఖానికి మాస్క్‌లు ధరించాలని చెబుతున్నాయి. అయినా కొంత మంది ఉన్నత స్థానంలో ఉన్నవారే ఈ నిబంధనలు పాటించకపోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు మరోసారి భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం చిత్రదుర్గానికి వెళ్లిన మంత్రి శ్రీరాములుకు స్వాగతం పలకడానికి బీజేపీ కర్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో ఆయన భౌతిక దూరం నిబంధనలు పాటించకుండా, కనీసం ముఖానికి మాస్క్‌ కూడా ధరించకుండా కార్యకర్తలతో కలిసిపోయారు. (మిస్సింగ్ పోస్ట‌ర్లు: 'స్మృతి ఇరానీ ఎక్క‌డ‌?')

అదేవిధంగా మంత్రి శ్రీరాములు తన చుట్టూ చేరినవారికి భౌతిక దూరం పాటించాలని సూచించకపోవటం గమనార్హం​. కంటైన్‌మెంట్‌ జోన్లలో మినహా మిలిగిన ప్రాంతాల్లో మతపరమైన కార్యక్రమాలను లాక్‌డౌన్‌ నిబంధనలకు లోబడి దశల వారిగా తెరుచుకోవచ్చని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప అనుమతించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు కర్ణాటకలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3408 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంత్రి లాక్‌డౌన్‌ ఉల్లంఘన చర్యపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. మంత్రి  శ్రీరాములు ఇలా భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘించటం ఇది రెండోసారి. 

మరిన్ని వార్తలు