ప్రముఖ ఐటీ సంస్థకు లీగల్‌ నోటీసులు

4 Jul, 2020 14:19 IST|Sakshi

ఉద్యోగుల తొలగింపుపై  న్యాయపోరాటం

కాగ్నిజెంట్‌కు కేఐటీయూ లీగల్‌ నోటీసులు

సాక్షి, బెంగళూరు : ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ చిక్కుల్లో పడనుంది. అక్రమంగా, చట్టవిరుద్ధంగా ఉద్యోగులను తొలగించిందన్న ఆరోపణలతో కర్ణాటక స్టేట్ ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) కాగ్నిజెంట్‌పై చట్టపరమైన చర్యలను ప్రారంభించింది. 18,000 మంది  కాగ్నిజెంట్ ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందన్న అంచనాల నేపథ్యంలో తాజా  పరిణామం చోటు చేసుకుంది.

దేశవ్యాప్తంగా  వేలాది ఉద్యోగుల తొలగింపులను ఖండించిన కేఐటీయూ తొలగించిన కొంతమంది ఉద్యోగుల ద్వారా  కాగ్నిజెంట్ యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపింది. 14 రోజులు  కాగ్నిజెంట్ నుండి ఆమోదయోగ్యమైన ప్రతిస్పందన రాకపోతే, కార్మిక శాఖను ఆశ్రయించనున్నామని యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఉల్లాస్ చమలరంబిల్ చెప్పారు. 

కార్మిక చట్టాల ప్రకారం, 100 మందికి పైగా ఉద్యోగులున్న సంస్థలు తొలగింపుల అమలుకు మొదట కార్మిక శాఖ నుండి అనుమతి పొందాలని కేఐటీయూ కార్యదర్శి సూరజ్ నిడియంగా చెప్పారు.  పైగా ఉద్యోగులు స్వచ్ఛంద రాజీనామా చేశారని కంపెనీ వాదిస్తోందనీ, వాస్తవానికి, రాజీనామా చేయవలసి రావడంచట్ట విరుద్ధమేనని పేర్కొన్నారు.  అలాగే బాధిత ఉద్యోగులు రాజీనామా చేయకుండా తమ ఉద్యమానికి మద్దతివ్వాలని కోరారు.  ఇందుకోసం ఒక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్టు ఉల్లాస్ తెలిపారు.

బెంగళూరుతోపాటు చెన్నై, పూణేలోని ఉద్యోగులు యూనియన్లను సంప్రదించాయనీ, ప్రాజెక్టులలో పనిచేసే ఉద్యోగులు కూడా రాజీనామా చేయమని  కంపెనీ ఒత్తిడి తెస్తోందని ఉల్లాస్ ఆరోపించారు. ఈ విషయంలో  తక్షణమే జోక్యం చేసుకొని కార్మిక చట్టాల ఉల్లంఘనలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కర్నాటక ప్రభుత్వాన్ని కేఐటీయూ డిమాండ్‌ చేసింది. మరోవైపు సామూహిక తొలగింపుల ఆరోపణలను కాగ్నిజెంట్ ప్రతినిధి  ఖండించారు.  కాగ్నిజెంట్‌తో సహా ఐటీ పరిశ్రమల్లో  పనితీరు నిర్వహణ  ఆధారంగా తొలగింపు అనేది ఒక సాధారణ ప్రక్రియ అని తెలిపింది.

మరిన్ని వార్తలు