3 వ్యాన్లలో జయ నగలు

7 Jan, 2014 09:45 IST|Sakshi
3 వ్యాన్లలో జయ నగలు

 చెన్నై నుంచి బెంగళూరు కోర్టుకు తరలింపు
 సాక్షి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆభరణాలను బెంగళూరు కోర్టుకు అప్పగించే పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. చెన్నై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి మూడు వ్యాన్లలో జయలలిత ఆభరణాలను తరలిస్తున్నారు. ఆమెపై అవినీతి నిరోధకశాఖ గతంలో మోపిన కేసులను బెంగళూరు ప్రత్యేక కోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి జయ బెంగళూరు కోర్టుకు స్వయంగా హాజరై తన వాదనలను కూడా వినిపించారు.

ప్రభుత్వం, జయలలిత తరపు సాక్షులను విచారించడం పూర్తయింది. ఈ నేపథ్యంలో జయకు సంబంధించిన నగలు, ఇతర చరాస్తులను కోర్టుకు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని డీఎంకే ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరిస్తూ బంగారు, వజ్రాలు, వెండి నగలు, ఇతర చరాస్తులను కోర్టు ముందుంచాలని న్యాయమూర్తి జాన్ మైఖేల్ ఇప్పటికే ఆదేశాలు వెలువరించారు.
 
  అయితే అత్యంత విలువైన ఆభరణాలను బెంగళూరుకు పంపేందుకు కట్టుదిట్టమైన భద్రత అవసరమని, మరికొంత గడువు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం కోర్టును అభ్యర్థించింది. దీంతో గడువును ఈనెల 20 వరకు కోర్టు పొడిగించింది. బెంగళూరు కోర్టు న్యాయమూర్తి డిగునా, న్యాయస్థాన అధికారి పచ్చముత్తు, బెంగళూరుకు చెందిన ఆర్‌బీఐ అధికారులతో కలిసి 11 మందితో కూడిన బృందం సోమవారం చెన్నైకి చేరుకుంది. ఆర్‌బీఐలో భద్రపరిచిన జయ ఆభరణాలను మూడు గంటలపాటు లెక్కించి డాక్యుమెంట్లు సిద్ధం చేశారు.
 

మరిన్ని వార్తలు