వైరల్‌ వీడియో : కోతి చేతికి స్టీరింగ్‌

6 Oct, 2018 14:22 IST|Sakshi

బెంగళూరు : ఈ మధ్య కాలంలో ఏదో ఒక చోట ఆర్టీసీ బస్సు లు ప్రమదాలకు గురవుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. వీటిలో కొన్ని డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల చోటు చేసుకున్నవి కూడా ఉన్నాయి. ఇలాంటి నిర్లక్ష్యపూరిత సంఘటనే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ బస్సు డ్రైవర్‌ ఏకంగా కోతి చేతికి స్టీరింగ్‌ ఇచ్చి దాని వేషాలను చూస్తూ కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో కర్ణాటక ప్రభుత్వం సదరు బస్‌ డ్రైవర్‌ని విధుల నుంచి తొలగించింది.

ఈ సంఘటన ఈ నెల 1న జరిగింది. వీడియోలో ఉన్న డ్రైవర్‌ పేరు ప్రకాష్‌. ఇతను దావణగేరె డివిజన్‌లో పనిచేస్తున్నాడు.  ఈ నెల 1న ప్రకాష్‌ దావణగేరె నుంచి భరమసాగర వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కోతి, దాని ట్రైనర్‌ రోజు ఇదే బస్సులో ప్రయాణం చేస్తుంటారని తెలిసింది. ఈ పరిచయం వల్ల  కోతి స్టీరింగ్‌ మీద కూర్చునప్పటికి డ్రైవర్‌ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా.. కోతి స్టీరింగ్‌ తిప్పుతుంటే అతను గేర్‌ మారుస్తూ వినోదం చూస్తున్నాడు. ఈ కోతి వేషాలను బస్సులోని ఓ ప్రయాణికుడు తన స్మార్ట్‌ఫోన్‌లో వీడియో తీశాడు.ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ విషయం కాస్తా అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో ఆ బస్సు డ్రైవర్‌ని సస్పెండ్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు