పౌర నిరసనలు: ‘ఈ స్క్రిప్ట్‌ రాసిందెవరు..?’

4 Feb, 2020 20:58 IST|Sakshi

బెంగుళూరు : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనకారుల అరెస్టులు మనం చూస్తూనే ఉన్నాం..! అయితే, కర్ణాటకలోని బీదర్‌లో వెలుగుచూసిన ఓ ఘటన మాత్రం పోలీసుల అత్యుత్సాహానికి నిదర్శనంగా నిలిచింది. విద్యార్థులతో నాటక ప్రదర్శన పేరుతో పౌర చట్టంపై అనుచిత వ్యాఖ్యలు చేయించారని పేర్కొంటూ ఇద్దరు మహిళలపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. అరెస్టైన వారిలో ఒకరు సదరు విద్యార్థి తల్లి కాగా, మరొకరు పాఠశాల ప్రిన్సిపల్‌. "వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం" అనే ఆరోపణల నేపథ్యంలో షాహీన్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.

బూటుతో కొట్టు..!
బీదర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో జవనరి 21న విద్యార్థుల నాటక ప్రదర్శన పోటీలు జరిగాయి. అయితే, నాటక ప్రదర్శనలో 9వ తరగతి విద్యార్థి ఒకరు.. సీఏఏపై అనుచితంగా ఓ వ్యాఖ్య చేశాడు. ‘జూతే మారేంగే’ (బూటుతో కొడతా) అన్నాడు. ఈ వీడియో బయటపడటంతో సామాజిక కార్యకర్త నీలేష్ రక్షాల్ జనవరి 26న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. స్కూల్‌ యాజమాన్యంపై, ప్రిన్సిపల్‌, విద్యార్థి తల్లిపై కేసులు నమోదు చేశారు.

ప్రతి రోజు 4 గంటల విచారణ..!
డీఎస్పీ రోజూ మధ్యాహ్న 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులను ప్రశ్నలతో వేధిస్తున్నారని స్కూల్‌ సీఈవో తౌసిఫ్‌ మేదికేరి వాపోయారు. విద్యార్థి పొరపాటు మాటలపై దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారో అర్థకావడం లేదని అన్నారు. ఈ మాటలు చెప్పుమన్నదెవరు..? ఈ స్క్రిప్ట్‌ రాసిందెవరు..? అని పదేపదే ప్రశ్నించి పోలీసులు పిల్లల్ని హింస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే విద్యార్థి వ్యాఖ్యలపై క్షమాపణలు కోరామని చెప్పారు. 

ఇక బీదర్‌ పోలీసుల చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో.. భావ ప్రకటనా స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారని నెటిజన్లు, పేరెంట్స్‌ గ్రూపులు మండిపడుతున్నాయి.‘బీదర్ పోలీసులు చట్టవిరుద్ధ, అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు’అని పేరెంట్స్‌ ఫర్‌ పీస్‌, జస్టిస్‌ అండ్‌ ప్లులారిటీ గ్రూప్‌ విమర్శించింది. ప్రిన్సిపల్‌, విద్యార్థి తల్లిని విడుదల చేయాలని, వారిపై కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

మరిన్ని వార్తలు