కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

13 Feb, 2019 10:32 IST|Sakshi

బెంగళూరు : తమ పార్టీ ఎమ్మెల్యేను ప్రలోభాలకు గురిచేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ప్రయత్నించినట్లుగా ఉన్న ఆడియో క్లిప్పింగులపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)తో విచారణ చేయించనున్నట్లు కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్లిప్పింగుల్లో తన పేరును కూడా ప్రస్తావించినందున నిజాలు నిగ్గు తేల్చాలంటూ అసెంబ్లీలో స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ప్రభుత్వానికి సూచించారు.

ఈ విషయమై అసెంబ్లీలో చర్చ రావడంతో రమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ... తనను తాను అత్యాచార బాధితురాలితో పోల్చుకున్నారు. ‘ ప్రస్తుతం నా పరిస్థితి అత్యాచార బాధితురాలిలాగా ఉంది. ఒకే ప్రశ్న గురించి వాళ్లను ఎలా అయితే అనేక మార్లు ప్రశ్నిస్తారో నా పేరు ప్రస్తావించడం కూడా అలాగే అన్పించింది’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆడియో క్లిప్పింగుల అంశాన్ని ప్రస్తావించిన బీజేపీ రాజకీయ కక్షతోనే కుమారస్వామి ప్రభుత్వం సిట్‌ దర్యాప్తునకు ఆదేశించిందని ఆందోళన చేశారు. ఈ క్రమంలో సభను వాయిదా వేసినట్లు ప్రకటించిన స్పీకర్‌.. ‘బాగా చర్చించి.. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన ఆవశ్యకత ఉంది’ అని పేర్కొన్నారు.

తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అధికార కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి, ప్రతిపక్ష బీజేపీ కొంతకాలంగా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, క్యాంప్‌ రాజకీయాలు చేయడం విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల సీఎం కుమారస్వామి.. బీజేపీ నేత యడ్యూరప్ప జేడీ(ఎస్‌)కు చెందిన ఎమ్మెల్యేను ప్రలోభపెడుతున్నట్లుగా ఉన్న ఫోన్‌ సంభాషణ క్లిప్పింగులను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఒకవేళ అధికార పక్ష ఎమ్మెల్యేలు బీజేపీ పక్షాన చేరినట్లయితే స్పీకర్‌ వారికి అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చేందుకు గాను రూ.50 కోట్లు ఇద్దామంటూ యడ్యూరప్ప అన్నట్లుగా అందులో రికార్డయి ఉంది.  

యడ్యూరప్ప ఏమన్నారు?
మొదట్లో వీటిని ఖండించిన యడ్యూరప్ప.. జేడీఎస్‌ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరణ్‌ గౌడతో తాను మాట్లాడింది నిజమేనంటూ ఆదివారం ప్రకటించారు. అయితే, సీఎం ప్రోద్బ లంతోనే అతడు తనతో భేటీ అయ్యాడని ఆరోపించారు. అందులోని కీలక అంశాలను తొలగించి, తమకు అనువుగా ఉండేలా సంభాషణ క్లిప్పింగులు రూపొందించారని అన్నారు. శాసనసభ సమావేశాలకు గైర్హాజరవుతున్న నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కాంగ్రెస్‌ కోరింది.

>
మరిన్ని వార్తలు