బోర్‌ కొడుతుందని ఫ్రెండ్‌ని సూట్‌కేసులో..

13 Apr, 2020 08:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మంగళూరు : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. 24 గంటలు ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక  నానా అవస్థలు పడుతున్నారు. ఇక టీనేజర్ల బాధలు అయితే చెప్పలేనివి. ప్రతి రోజు ఫ్రెండ్స్‌ని కలవడం, సినిమాలు, షికార్లు అంటూ జాలీగా తిరిగే వారు.. ఇప్పుడు ఇంటికే పరిమతమయ్యారు. కనీసం స్నేహితులను కలవడానికి కూడా వీల్లేకపోవడంతో పిచ్చిపిచ్చి ప్లాన్లు వేసి అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ టీనేజర్‌ తన ఫ్రెండ్‌ను ఇంటికి తీసుకురావడానికి వెరైటీ ప్లాన్‌ చేసి అడ్డంగా దొరికిపోయాడు. 

మంగళూరులోని సుమారు 90 ఫ్లాట్లు ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఓ టీనేజర్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతని కుటుంబ సభ్యులకు ఆ అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. లాక్‌డౌన్‌తో కుటుంబ సభ్యులంతా ఒకే ఇంట్లో ఉంటుంటే.. అతను మాత్రం సెపరేట్‌గా రెండో ఫ్లాట్‌లో ఉంటున్నాడు. అయితే కరోనా కారణంగా ఆ అపార్టమెంట్‌లోకి ఫ్లాట్ల యజమానులందరూ.. బయటవారిని లోనికి అనుమతిచ్చేది లేదని ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో టీనేజర్‌కి ఫోన్ చేసిన అతని స్నేహితుడు ఇంట్లో ఒంటరిగా బోర్ కొడుతోందని.. తాను కూడా ఫ్లాట్‌కి వస్తానని అడిగాడు. ఈ విషయం అపార్ట్‌మెంట్‌ పెద్దలకు చెప్పగా..దానికి నిరాకరించారు.

ఈ నేపథ్యంలో అతడు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఓ పెద్ద సూట్‌కేసులో తన స్నేహితుడిని దాచి.. తన ఫ్లాట్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే సూట్‌కేసు లాగేందుకు అతడు పడుతున్న అవస్థ, ఆ సూట్‌కేసు‌ కదలికలు ఇతరులకు అనుమానం కలిగించాయి. దీంతో అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీ సిబ్బంది ఆ సూట్‌కేసును తెరచి చూడగా అసలు విషయం బయటపడింది. దీంతో ఈ విషయాన్ని అపార్ట్‌మెంట్‌ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా..వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇద్దరు టీనేజర్లను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వారి వారి తల్లిదండ్రులను కూడా స్టేషన్‌కు పిలిపించినట్టు తెలిసింది. అయితే పోలీసులు ఎటువంటి కేసులూ నమోదు చేయలేదు. 

మరిన్ని వార్తలు