కరోనా : గంటకో సెల్ఫీ! 

31 Mar, 2020 11:46 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి,  బెంగళూరు : కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారు  క్వారంటైన్ లో ఉండాలని,  వ్యక్తిగత దూరాన్ని పాటించాలని వైద్య నిపుణులు పదే పదే  సూచిస్తున్నారు.  అలాగే వైరస్ సోకిన వారు క్వారంటైన్ వార్డు నుంచి పారిపోయినా,  స్వీయ నిర్బంధనను అతిక్రమించి బయటికి వెళ్లినా కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నాయి. అయినా క్వారంటైన్ ముద్ర  ఉన్నా పారిపోయి ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్న చెదురు మదురుసంఘటనలు కూడా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటక  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇంట్లో నిర్బంధంలో ఉన్న వారందరినీ వారు తమ ఇంటి నుంచి ప్రతీ గంటకు ఒక సెల్ఫీ పంపించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఇలా సెల్ఫీ పంపించడంలో విఫలమైతే అలాంటి వారిని  గుర్తించి, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సామూహిక దిగ్బంధన కేంద్రాలకు తరలిస్తామని హెచ్చరించింది. సెల్ఫీలో వ్యక్తుల లొకేషన్ సంబంధించిన వివరాలు కూడా జత చేయాలని సూచించింది. అలాగే ఈ సెల్పీలను ప్రభుత్వం నిపుణుల బృందం పరిశీలిస్తుంది కాబట్టి తప్పుడు ఫోటోలు పంపినట్టు తేలినా చర్యలు తప్పదని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య విద్య మంత్రి డాక్టర్ కె. సుధాకర్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.  రాత్రి 10 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు (నిద్రపోయే సమయం తప్ప) గంటకు ఒకసారి సెల్పీ తీసి పంపాలని కోరారు. ఇలా 14 రోజుల పాటు రోజుకు 15 సెల్ఫీలు, మొత్తం  క్వారంటైన్ కాలానికి మొత్తం 210 సెల్ఫీలు పంపాలన్నమాట. రాష్ట్రంలో కోవిడ్-19  ప్రభావం బాగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా ఇప్పటికే తీసుకున్న అన్ని ఇతర చర్యలకు అదనంగా  తాజా నిర్ణయం తీసుకుంది. 

మరోవైపు కర్నాటక ప్రభుత్వం నిర్ణయంపై ప్రైవసీ నిపుణులు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. క్వారంటైన్ ఉన్నవారినుంచి పెద్ద మొత్తంలో డేటాను సేకరించాల్సిన అవసరాన్ని ప్రశ్నించిన ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపర్ గుప్తా సెల్ఫీలు తీసుకోవడం, ప్రతి గంటకు వాటిని అప్‌లోడ్ చేయడం వల్ల అవసరమైన దానికంటే ఎక్కువ సమాచారం సేకరిస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఈ డేటాను తొలగిస్తారా లేదా అనేదానిపై స్పష్టత లేదన్నారు. అలాగే  కర్ణాటక రెవెన్యూ శాఖ వెబ్‌సైట్‌ ప్రైవసీపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

కాగా  కర్నాటక  రాష్ట్రంలో కరోనాకు సంబంధించి 88 మంది పాజిటివ్ కేసులు నమోదు గాకా  ముగ్గురు చనిపోయారు.  బెంగళూరులో 41, మైసూరులో 12 కేసులు నమోదు కావడంతో బెంగళూరులోని సమాచార, ప్రజా సంబంధాల శాఖ (డిఐపిఆర్) కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ -19 కంట్రోల్ రూంను, హెల్ప్‌లైన్ నంబర్‌లను ఏర్పాటు చేసింది.  విదేశీ దేశం నుండి తిరిగి వచ్చిన వ్యక్తులతో సహా  23,152 మందికి క్వారంటైన్  స్టాంప్  వేసినట్లు కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన  ప్రకటనలో తెలిపింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు