దీపిక ముక్కు కోస్తాం!

17 Nov, 2017 00:58 IST|Sakshi

పద్మావతి హీరోయిన్‌కు కర్ణిసేన హెచ్చరిక

భన్సాలీ, దీపిక తలలు తెచ్చినవారికి రూ.5 కోట్ల బహుమానం: ఠాకూర్‌

చిత్రం విడుదలైతే శాంతిభద్రతలకు విఘాతమే: యోగి

కోట/జైపూర్‌/లక్నో: సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావతి సినిమా వివాదం కొత్తరూపు తీసుకుంది. ఈ చిత్రంలో రాణి పద్మినిగా నటించిన దీపికా పదుకొనే ముక్కు కోస్తామని శ్రీ రాజ్‌పుత్‌ కర్ణిసేన పరోక్షంగా హెచ్చరించింది. దీపిక రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోకపోతే రామాయణంలో లక్ష్మణుడి చేతిలో శూర్పణకకు పట్టిన గతే ఆమెకు పడుతుందని చెప్పింది. పద్మావతి చిత్రం విడుదలను ఎవ్వరూ అడ్డుకోలేరనీ, ఒకదేశంగా భారత్‌ తిరోగమిస్తోందని ఇంతకుముందు దీపిక వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కర్ణిసేనకు చెందిన నేత మహిపాల్‌సింగ్‌ మక్రానా మీడియాతో మాట్లాడుతూ.. ‘క్షత్రియులు మహిళల్ని అమితంగా గౌరవిస్తారు.

ఒకవేళ ఈ చిత్రాన్ని విడుదల చేసినా, దీపిక మా మనోభావాలు దెబ్బతినేలా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోకపోయినా రామాయణంలో లక్ష్మణుడిలా ప్రవర్తించేందుకు రాజపుత్రులు ఎంతమాత్రం వెనుకాడరు’ అని హెచ్చరించారు. అసలు డెన్మార్క్‌ పౌరసత్వం ఉన్న దీపిక రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా చేస్తారని సింగ్‌ ప్రశ్నించారు. క్షత్రియుల శౌర్యపరాక్రమాలను చూపిస్తూ బాహుబలి లాంటి సినిమాలు కోట్లు అర్జిస్తుంటే.. వక్రీకరణలతో ఇలాంటి సినిమా తీయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో దీపికకు భద్రతను పెంచినట్లు మహారాష్ట్ర హోంశాఖ సహాయమంత్రి రంజిత్‌ పాటిల్‌ తెలిపారు. ఈ సినిమా దర్శకుడు భన్సాలీకి ఇప్పటికే భద్రత కల్పించినట్లు వెల్లడించారు. ఈచిత్రంలో రాణి పద్మినిగా దీపిక, రాజా రతన్‌సింగ్‌గా షాహీద్‌ కపూర్, అల్లావుద్దీన్‌ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్‌ నటించారు.

ప్రజాగ్రహాన్ని దృష్టిలో ఉంచుకోండి:
పద్మావతి చిత్రం డిసెంబర్‌ 1న విడుదలైతే రాష్ట్రంలో తీవ్రమైన శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. డిసెంబర్‌ 2న జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉన్న వనరులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. సినిమా విడుదలకు ముందు ప్రజాగ్రహాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా యూపీ ప్రభుత్వం సెన్సార్‌ బోర్డును కోరింది. ఈ సినిమాకు సర్టి ఫికెషన్‌ ఇచ్చేది తాను కాదనీ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతం కల్పించే ప్రతి చర్యను అడ్డుకుని తీరుతామని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ లేఖలో వెల్లడించారు.

మరోవైపు పద్మావతి చిత్రం విడుదలయ్యే థియేటర్లకు రక్షణ కల్పిస్తామని మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ప్రకటించాయి. పద్మావతి విడుదలకు వ్యతిరేకంగా 10వేలమంది రక్తంతో కూడిన సంతకాల సేకరణ చేపడతామని, దీన్ని సెన్సార్‌ బోర్డుకు పంపిస్తామని ‘సర్వ బ్రాహ్మణ మహాసభ’ తెలిపింది. భన్సాలీ, దీపిక తలలు నరికి తెచ్చినవారికి రూ.5 కోట్ల బహుమానం ఇస్తానని మీరట్‌కు చెందిన ఠాకూర్‌ అభిషేక్‌ సోమ్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు