రజనీతో కార్తీ భేటీ

26 Oct, 2014 23:35 IST|Sakshi
రజనీతో కార్తీ భేటీ

 దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌ను రాజకీయ పక్షాల నేతలు వరుసగా కలుసుకుంటూ రావడం చర్చనీయాంశం  అవుతోంది. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం తాజాగా రజనీతో భేటీ కావడంతో రాజకీయ వర్గాలు ఆంతర్యాన్ని వెతికే పనిలో పడ్డాయి.
 
 సాక్షి, చెన్నై : రజనీ కాంత్ ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలకు హాట్ కేకులా మారుతున్నారు. ఆయన్ను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ఆయనకు సీఎం అభ్యర్థిత్వాన్ని సైతం ఆఫర్ చేసింది. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా రజనీ కాంత్ లేఖాస్త్రం సంధించడం బీజేపీ వర్గాల్ని కలవరంలో పడేసింది. జయలలితను పరామర్శిస్తూ రజనీ రాసిన లేఖ తో అన్నాడీఎంకే వర్గాలు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ తమ వెంట ఉన్న రజనీ కాంత్, రానున్న ఎన్నికల్లోను తమకు మద్దతుగానే ఆయన వ్యవహరిస్తారన్న ఆశాభావం అన్నాడీఎంకేలో వ్యక్తమవుతోంది. ఈ లేఖాస్త్రం ఓ వైపు చర్చకు దారి తీసిన సమయంలో డీఎంకే నేతలు పలువురు రజనీని రెండు రోజుల క్రితం  పరామర్శించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తమ వంతు వచ్చినట్టుగా కాంగ్రెస్ నేతలు రజనీ కాంత్‌తో భేటీ కావడం మరింత ఆసక్తికరంగా మారింది.
 
 కార్తీ భేటీ : మూడు నెలలుగా రజనీ కాంత్ లింగా చిత్రం షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. పది రోజుల క్రితం చెన్నైకు వచ్చిన ఆయన, లింగా చిత్ర వ్యవహారాల మీద దృష్టి పెట్టారు. దీంతో పోయెస్ గార్డెన్‌లో ఉన్న రజనీ కాంత్‌ను ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా అటు రాజకీయ వర్గాలు, ఇటు మిత్రులు కలుసుకుంటున్నారు. శనివారం సాయంత్రం కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు, కాంగ్రెస్ నేత కాార్తీ చిదంబరం పోయేస్ గార్డెన్‌లో రజనీ కాంత్ ఇంటి మెట్లు ఎక్కారు. రజనీ కాంత్‌ను కలుసుకుని పుష్ప గుచ్ఛాలు అందజేశారు. కార్తీ వెంట మరో ముగ్గురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
 
 తన ఇంటికి వచ్చిన కార్తీతో చాలా సేపు రజనీకాంత్ మాటా మంతిలో మునిగారు.  కార్తీ చిదంబరం నేతృత్వంలోని ఓ ట్రస్టు కార్యక్రమానికి రజనీ కాంత్‌ను ఆహ్వానించినట్టు సమాచారం. ఈ భేటీ గురించి కాంగ్రెస్ వర్గాల్ని కదిలించగా, కార్తీ చిదంబరం రజనీకాంత్‌ను కలిసిన మాట వాస్తవేమనని, అయితే, అది వ్యక్తిగతమేనంటున్నారు. చిదంబరం మద్దతుదారుల్ని కదిలించగా, రజనీ కాంత్, కార్తీ చాలా సేపు రాజకీయాల గురించి మాట్లాడుకున్నారని, అలాగే, కార్తీ ట్రస్టు నేతృత్వంలో జరగనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజనీ కాంత్‌ను ఆహ్వానించి ఉన్నట్టు పేర్కొంటున్నారు. అయితే గతంలో కాంగ్రెస్‌తో కయ్యం ఏర్పడ్డప్పుడు చిదంబరం సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు ఏదైనా సాగేనా లేదా, ఈ భేటీ కేవలం మర్యాదేనా..? అన్న విషయమై ఆంతర్యాన్ని వెతికే పనిలో రాజకీయ వర్గాలు పడ్డాయి.
 
 చిదంబరంపై ఆగ్రహం:  ఓ వైపు రజనీ కాంత్‌తో కార్తీ చిదంబరం భేటీ అయితే, మరో వైపు  చిదంబరంపై ఏకంగా కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం ప్రదర్శించాయి. ఆంగ్ల మీడియాకు చిదంబరం  ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నెహ్రు, ఇందిరా కుటుంబాలకు చెందని వ్యక్తి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే సమయం వస్తుందని పేర్కొనడంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యల్ని టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు, ఎమ్మెల్యే విజయ ధరణిలు ఖండించారు. నెహ్రు, ఇందిర కుటుంబాలకు చెందిన వాళ్లు అధ్యక్షులుగా ఉండబట్టే పార్టీ బలంగా ఉందని, లేని పక్షంలో పార్టీలో ఐక్యత కొరవడి ఉండేదన్న విషయాన్ని చిదంబరం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ అయితే, చిదంబరం వ్యాఖ్యల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో ఆధిపత్యం లక్ష్యంగా కేంద్ర మాజీ మంత్రులు జీకే వాసన్, చిదంబరం మద్దతు గ్రూపుల మధ్య పోటీ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో విరక్తితో చిదంబరం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన మద్దతు దారులు పేర్కొనడం ఆలోచించాల్సిందే.  

 

మరిన్ని వార్తలు