‘బరువు తగ్గాలా....సీబీఐకి ఫోన్‌ చేయండి’

13 Mar, 2018 12:57 IST|Sakshi

న్యూఢిల్లీ : బరువు తగ్గడానికి మనలో చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. జిమ్‌కి వెళ్లడం, వర్కవుట్లు చేయడం, ఆయసం వచ్చేలా పరుగులు పెట్టడం ఇవన్నీ బరువు తగ్గే ప్రక్రియలో భాగంగా ఎంచుకుంటుంటారు. అయితే ఈ ఆపసోపాలేమీ పడక్కర్లేదట. బరువు తగ్గాలనుకునే వారందరికి సులువైన ఉపాయం చెప్తా అంటున్నారు కార్తీ చిదంబరం. అది ఏంటో ఆయన మాటల్లోనే విందాం...‘బరువు తగ్గాలనుకునే వారు జిమ్‌కు వెళ్లి కష్టపడక్కర్లేదు. కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. సీబీఐ కస్టడీలో ఉంటూ వారి కాంటీన్‌ తిండి తింటే చాలు. వెంటనే బరువు తగ్గిపోతారు. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న నేను చాలా తక్కువ తింటున్నాను. ఫలితంగా చాలా బరువు కోల్పోయాను. ఇప్పుడు నేను కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఎందుకంటే పాత బట్టలన్ని లూజ్‌ అయిపోయాయి'' అని తెలిపారు.

12 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న కార్తీ చిదంబరాన్ని సోమవారం న్యూఢిల్లీలోని తీహార్‌ జైలుకు పంపించారు. ఈ సందర్భంగా తన భద్రత దృష్ట్యా తీహార్‌ జైలులో తనకు ప్రత్యేక గదిని, బాత్‌రూమ్‌ని కేటాయించాలని కోర్టును అభ్యర్థించారు. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సునీల్‌ రాణా ఈ అభ్యర్థనను తిరస్కరించారు. జైలు అధికారులే కార్తీ భద్రతకు హామీ ఇవ్వాలని ఆదేశించారు. తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, ఒకవేళ కోర్టు ఆదేశిస్తే ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని అనుమతిస్తామని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. 

ఐఎన్‌ఎక్స్‌ కేసులో కార్తీ చిదంబరం నిందితుడిగా ఉన్నారు. తన తండ్రి పి. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ముఖర్జీల ఐఎన్‌ఎక్స్‌ మీడియా కంపెనీకి రూ.305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు క్లియరెన్స్‌ ఇప్పించడం కోసం వారి వద్ద నుంచి రూ. 3 కోట్లకు పైగా ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జీ స్టేట్‌మెంట్‌ను కూడా సీబీఐ రికార్డు చేసింది. ప్రస్తుతం ఐఎన్‌ఎక్స్‌ మీడియా హౌజ్‌కు సహవ్యవస్థాపకులైన ఇంద్రాణి ముఖర్జీ, పీటర్‌ ముఖర్జీలు కూడా కుమార్తె షీనా బోరాను హత్య కేసులో జైలులో ఉన్నారు. పీటర్‌ ముఖర్జీని ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కస్టడీకి తీసుకోనున్నామని సీబీఐ తెలిపింది. గత నెల 28న కార్తి చిదంబరాన్ని చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు