'మా అబ్బాయి కాబట్టే టార్గెట్ చేస్తున్నారు'

7 Mar, 2016 08:16 IST|Sakshi
'మా అబ్బాయి కాబట్టే టార్గెట్ చేస్తున్నారు'

కార్తీ తన కుమారుడు కాబట్టే అతడిపై ఆరోపణలు చేస్తున్నారని, వాళ్ల అసలు టార్గెట్ తానేనని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం వాపోయారు. విదేశాల్లో కార్తీకి వెల్లడించని ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఖండించారు. నిజంగా కార్తీకి అలాంటి ఆస్తులు ఏమైనా ఉంటే, ప్రభుత్వం వాటి జాబితాను తయారు చేయాలని, ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని వాటన్నింటినీ రిజిస్టర్ చేస్తారని చెప్పారు. కార్తీ ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారంటూ ఇటీవల వచ్చిన వార్తాకథనాలపై చిదంబరం స్పందించారు.

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ కార్తీ భారీ సామ్రాజ్యం నిర్మించుకున్నాడని, దాంతోపాటు 14 దేశాల్లో ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయంటూ ఇటీవల మీడియా కథనాలు వచ్చాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఎయిర్‌సెల్-మాక్సిస్ స్కాంలో ఆదాయపన్ను శాఖ దర్యాప్తు ఆధారంగా ఈ వివరాలు తెలిశాయన్నది ఆ కథనాల సారాంశం. వీటి నేపథ్యంలోనే చిదంబరం స్పందించారు. కార్తీ న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నాడని, దాంతోపాటు వారసత్వ ఆస్తిని నిర్వహిస్తున్నాడని, చాలా కాలంగా ఆదాయపన్ను ఎసెసీగా ఉన్నాడని చెప్పారు. అతడి ఆస్తులు, అప్పులు అన్నింటి వివరాలూ ఆదాయపన్ను రిటర్నులలో పేర్కొన్నాడని, అలా చెప్పకుండా దాచిపెట్టిన ఆస్తులు ఎక్కడా లేవని అన్నారు. కేవలం తనను టార్గెట్ చేయడానికే కార్తీపై ఇలాంటి అసత్య కథనాలు వస్తున్నాయని అన్నారు.

>
మరిన్ని వార్తలు