35 ఏళ్ల క్రితం కరుణానిధి సాయం

9 Aug, 2018 03:51 IST|Sakshi

ముంబైలో తమిళుల కోసం స్కూల్, లైబ్రరీ

ముంబై: తమిళభాషపై అపార ప్రేమ ఉన్న కరుణానిధి, తమిళులు ఎక్కడ నుంచి సాయం కోరినా వెంటనే స్పందించేవారు. అన్నిరకాలుగా అదుకునేందుకు ప్రయత్నించేవారు. తాము కోరిన వెంటనే సమావేశానికి వచ్చిన కరుణానిధి, తమిళులకు ఓ స్కూల్‌తో పాటు లైబ్రరీ ఏర్పాటుకు సహకరించారని డీఎంకే ముంబై విభాగం చీఫ్‌ ఆర్‌.పళనిస్వామి గుర్తుచేసుకున్నారు. ‘ముంబైలో 1983లో తమిళులంతా కలసి నిర్వహించిన ఓ సమావేశానికి రావాల్సిందిగా మేము కరుణానిధిని ఆహ్వానించాం.

ఆయన అందుకు అంగీకరించడమే కాకుండా మేం ఏయే కార్యక్రమాలు చేపడుతున్నామో, మాకు ఏం ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళులు గణనీయంగా ఉన్న ధారావి ప్రాంతంలో కమ్యూనిటీ స్కూల్‌ లేదనీ, నిధులు లేకపోవడం వల్లే దాని నిర్మాణం చేపట్టలేకపోయామని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. దీంతో స్కూల్‌ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ సీనియర్‌ నేతల్ని కరుణానిధి ఆదేశించారు. కేవలం ఆయన తీసుకున్న చొరవతో ఈ ప్రాంతంలో ఓ స్కూల్‌తో పాటు లైబ్రరీ కూడా ఏర్పాటైంది’ అని పళనిస్వామి చెప్పారు. ముంబై సమావేశానికి వచ్చిన సందర్భంగా కరుణ వేలాది మందిని కలుసుకున్నారన్నారు.  

2010లోనే ఆసుపత్రి కోసం ఇల్లు దానం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెన్నై గోపాలపురంలోని ఖరీదైన తన ఇంటిని ఆసుపత్రి స్థాపన కోసం 2010లోనే దానమిచ్చారు. ఆ ఏడాది తన 86వ జన్మదిన వేడుకల సందర్భంగా కరుణానిధి తన కొడుకులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కరుణానిధితోపాటు ఆయన భార్యలు కూడా చనిపోయిన తర్వాత ఈ ఆసుపత్రిని స్థాపించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కరుణానిధి తల్లి పేరిట అన్నై అంజుగమ్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయగా, కరుణ కుటుంబసభ్యులతోపాటు కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, ప్రముఖ తమిళ గేయరచయిత వైరముత్తు తదితరులు కూడా ట్రస్ట్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ ఆసుపత్రికి కలైజ్ఞర్‌ కరుణానిధి హాస్పిటల్‌ అని పేరుపెట్టనున్నారు.

మరిన్ని వార్తలు