‘కారుణ్య మరణం’పై స్పందించండి!

17 Jul, 2014 02:23 IST|Sakshi
‘కారుణ్య మరణం’పై స్పందించండి!

రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
 
న్యూఢిల్లీ: కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేయడంపై స్పందించాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు అంగీకరించిన చీఫ్ జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. ‘ఇది కేవలం రాజ్యాంగానికి సంబంధించిన విషయం కాదు. ఇందులో నైతికత, మతం, వైద్య శాస్త్రాల ప్రమేయం కూడా ఉంది. అందువల్ల దీనిపై కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది’ అని స్పష్టం చేసింది. నయం కాని వ్యాధికి గురై. అలవిమాలిన బాధను అనుభవిస్తున్న వ్యక్తి స్వచ్ఛందంగా మరణాన్ని కోరుకుంటే.. ఆ వ్యక్తికి అందిస్తున్న వైద్యాన్ని, ప్రాణ రక్షక వైద్య ప్రక్రియను నిలిపివేసి.. చనిపోయేలా చేయడాన్ని నిష్క్రియాత్మక కారుణ్య మరణం(పాసివ్ యూథనేసియా)గా పరిగణిస్తారు. అయితే, ఈ మరణాన్ని చట్టబద్ధం చేయడాన్ని కేంద్రం సుప్రీంకోర్టులో తీవ్రంగా వ్యతిరేకించింది. అదీ ఒక రకంగా ఆత్మహత్యలాంటిదే అని, ఆత్మహత్యను మన దేశంలో నిషేధించారని గుర్తుచేసింది. ఈ మరణాన్ని చట్టబద్ధం చేయడం వల్ల  దుర్వినియోగమయ్యే అవకాశముందని వాదిం చింది. అంతేకాకుండా ఈ విషయంపై కోర్టులు కాకుండా శానసవ్యవస్థ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేయాలని, మరణించే హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని కోరుతూ ‘కామన్ కాజ్’ ఎన్జీఓ వేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీం పైవిధంగా స్పందించింది.

తల్లి పేరుపై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

చిన్నారులకు సంబంధించిన అధికారిక పత్రాలు, అఫిడవిట్లలో తల్లి పేరుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్పందన కోరుతూ బుధవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం అధికారిక పత్రాల్లో తండ్రి పేరు రాయడం తప్పనిసరి చేసినా.. తల్లి పేరును ఆప్షనల్‌గా పేర్కొంటున్నారని, దీన్నీ తప్పనిసరి చేయాలని కోరుతూ జర్నలిస్ట్ మాధవ్‌కాంత్ మిశ్రా వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది.
 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా