కశ్మీర్‌ : ఆపిల్‌ రైతులపై దాడులు; సంబంధాలే ముఖ్యం

27 Oct, 2019 16:53 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో నిత్యం జరిగే ఉగ్రదాడులతో ప్రజలు భయంభయంగా బతుకున్నారు. ఇక రైతుల కష్టాలు సరేసరి. తాము పండించిన పంటను మార్కెట్‌కు తరలించి అమ్మకునేందుకు ఆపిల్‌ రైతులు, సరఫరాదారులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇటీవల దక్షిణ కశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆపిల్‌ పంట ట్రాన్స్‌పోర్టు చేస్తున్న ఓ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడిచేసి ఇద్దరు కాశ్మీరీయేతర ట్రక్కు డ్రైవర్లను కాల్చి చంపారు. మరో రెండు ట్రక్కులను ఉగ్రవాదులు తగులబెట్టారు. అక్టోబర్ 14న  రాజస్తాన్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్లను కాల్చి చంపారు. దీంతో కశ్మీర్‌కు వాహనాల్ని పంపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

బయటి రాష్ట్రాలకు ఆపిల్‌ పంటను రవాణా చేసే క్రమం‍లో దాడులు జరుగుతున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌ పరిపాలన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్‌) ఆపిల్‌ రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. బయటి రాష్ట్రాల్లో అమ్ముకుంటే వచ్చేదానికన్నా ఎక్కువ ధర చెల్లించిమరీ కొనుగోలు చేస్తామని అన్నారు. అయితే, ఈ విధానంపై రైతులు, వ్యాపారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల వ్యక్తులతో సంవత్సరాల నుంచి ఉన్న తమ వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయని అంటున్నారు.

ఎంఐఎస్‌ స్కీమ్‌పైగులాంనబీ అనే రైతు మాట్లాడుతూ.. ‘సంప్రదాయ మార్కెటింగ్‌ విధానంలోనే ఇటీవల 15 కిలోల ఆపిల్‌ పెట్టెను కశ్మీర్‌ నుంచి ఢిల్లీకి సరఫరా చేశాను. దాదాపు రూ.700 నుంచి రూ. 800 వరకు లాభం వచ్చింది. కానీ ఎంఐఎస్‌ స్కీమ్‌ ద్వారా సరఫరా చేస్తే రూ.1000 వచ్చేవి. అయితే, నాకది ఇష్టం లేదు. బయటి రాష్ట్రాల ప్రజలు, వ్యాపారులతో  చాలా ఏళ్లుగా ఉన్న సంబంధాలే మాకు ముఖ్యం. డబ్బులు ప్రధానం కాదు.  పంజాబ్ లేదా దక్షిణ భారతదేశంలోని వ్యాపారులతో కశ్మీర్‌ వ్యాపారుల సంబంధాలను విచ్ఛిన్నం చేయడం మాకు ఇష్టం లేదు’అన్నాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా