ముప్పై ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో తొలి మల్టీప్లెక్స్‌

24 Jun, 2020 09:35 IST|Sakshi

శ్రీనగర్‌: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత.. కశ్మీర్‌ ప్రజలు బిగ్‌ స్క్రీన్‌పై బాలీవుడ్‌ చిత్రాలను చూడనున్నారు. ప్రస్తుతం శ్రీనగర్‌లో మొట్టమొదటి మల్టీప్లెక్స్‌ నిర్మాణం జరుగుతోంది. మూడు అంతస్తుల ఈ థియేటర్‌ 2021 మార్చిలో ప్రారంభం కానుంది. 1990 కాలంలో ఉగ్రవాద గ్రూపులు జారీ చేసిన ఆదేశాల కారణంగా కశ్మీర్‌లోని చాలా థియేటర్లు మూతబడ్డాయి. అయితే ప్రస్తుతం కశ్మీర్‌లో ఉగ్రవాద గ్రూపులు బలహీనపడటంతో.. సాధరణ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఈ మల్టీప్లెక్స్‌ నిర్మాణానికి, సినిమాలను ప్రదర్శించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్మాణం పూర్తయిన తర్వాత లైసెన్స్‌ మంజూరు చేయబడుతుంది. ఈ మల్టీప్లెక్స్‌లో మూడు థియేటర్లు ఉండనున్నాయి. 1990 కాలంలో శ్రీనగర్‌లో బాగా ప్రసిద్ధి చెందిన బ్రాడ్‌వే సినిమా హాలుకు ఎదురుగా ఈ మల్టీప్లెక్స్‌ నిర్మాణం జరుగుతుంది. (నర హంతకుడిగా.. లెక్కల మాస్టారు)

ఈ మల్టీప్లెక్స్‌ను ధార్‌ కుటుంబానికి చెందిన ఎమ్‌ / ఎస్‌ తక్సల్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ శ్రీనగర్‌లోని బాదామి బాగ్ కంటోన్మెంట్ ప్రాంతంలో నిర్మిస్తుంది. ఈ సందర్భంగా థియేటర్‌ యజమాని విజయ్‌ ధార్‌ మాట్లాడుతూ.. ‘గత 30 ఏళ్లుగా ఇక్కడి యువతకు ఎలాంటి వినోదం లభించలేదు. ఇతర ప్రాంత ప్రజలకు లభిస్తున్న సౌకర్యం ఇక్కడి ప్రజలకు కూడా అందాలి అనే ఉద్దేశంతో ఈ థియేటర్‌ నిర్మాణం చేపట్టాం’ అని తెలిపారు. కశ్మీర్‌ సినీ రంగ ప్రముఖులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

కశ్మీరి చిత్రనిర్మాత ముష్తాక్ అలీ మాట్లాడుతూ.. ‘మల్టీప్లెక్స్‌ నిర్మాణాన్ని నేను స్వాగతిస్తున్నాను. కశ్మీర్‌కు ఈ తరహా సౌకర్యాలు కావాలి. ఈ థియేటర్‌ బాలీవుడ్‌ను తిరిగి కశ్మీర్‌కు తీసుకురాగలదు. ఎందుకంటే చాలావరకు బాలీవుడ్ చిత్రాలు కశ్మీర్‌లోనే చిత్రీకరించబడ్డాయి. బాలీవుడ్‌కు కశ్మీర్‌తో దశాబ్దాల అనుబంధం ఉంది. ఈ మల్టీప్లెక్స్‌ ఎప్పుడు తెరుచుకుంటుందా అని నేను ఆత్రుతుగా ఎదురు చూస్తున్నాను. ఈ థియేటర్‌లో సినిమా చూసే మొదటి వ్యక్తి నేనే’ అన్నారు. 1990లకు ముందు, శ్రీనగర్‌లో ఫిర్దాస్, షిరాజ్, ఖయం, నాజ్, నీలం, షా, బ్రాడ్‌వే, రీగల్, పల్లాడియం వంటి 10 సినిమా హాళ్లు ఉండేవి. వీటిలో ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలను ప్రదర్శించేవారు. అయితే 90ల ప్రారంభంలో ఉగ్రవాదం ఊపందుకోవడం.. సినిమా హాళ్లను మూసివేయాలని ఉగ్రవాదులు థియేటర్ యజమానులను బెదిరించడంతో ఇవన్ని మూతబడ్డాయి. (ఈ ఫోటోకి ఏం అవార్డు ఇస్తారు?)

మరిన్ని వార్తలు