హృదయాలను కలిచి వేస్తోన్న ఫోటో

18 Jun, 2019 10:57 IST|Sakshi

కశ్మీర్‌ : ఖాకీలనగానే కాఠిన్యం.. కరకు రాతి గుండెలున్న మనుషులుగా ఓ చిత్రం మన కళ్ల ముందు కదులుతుంది. కానీ విధి నిర్వహణలో భాగంగానే వాళ్లు అలా కఠినంగా ప్రవర్తిస్తారు. అనునిత్యం నేరస్తులతో కలిసి ఉండటం మూలానా వారి గుండెలు కూడా బండ బారిపోతాయేమో. అయితే ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోన్న ఓ ఫోటో చూస్తే ఖాకీలు కూడా అందరిలాంటి వారేనని వారికి కూడా స్పందించే హృదయం ఉంటుందని అర్థం అవుతుంది. ఓ ఉన్నతాధికారి.. చనిపోయిన సహోద్యోగి కుమారుడిని ఎత్తుకుని కన్నీటి పర్యంతమవుతున్న ఫోటో ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది

వివరాలు.. గత వారం అనంతనాగ్‌లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో అర్షద్‌ ఖాన్‌ అనే పోలీసు అమరుడయ్యాడు. ప్రభుత్వ లాంఛనాలతో అతని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ సుపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ హసీబ్‌ ముఘల్‌ హాజరయ్యారు. ఈ క్రమంలో హసీబ్‌, మరణించిన అర్షద్‌ ఖాన్‌ నాలుగేళ్ల కుమారుడు ఉబన్‌ను ఎత్తుకుని కన్నీటి పర్యంతమయ్యాడు.  ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరలవుతూ ఎంతో మందిని కదిలిస్తోంది.

ముష్కరులకు, భద్రతా దళాలలకు మధ్య జరిగిన కాల్పుల్లో అర్షద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. కానీ దురదృష్టవశాత్తు రెండు రోజుల క్రితం అర్షద్‌ మరణించాడు. శ్రీనగర్‌కు చెందిన అర్షద్‌కు ఇద్దరు కుమారులున్నారు. వీరితో పాటు తల్లిదండ్రులు, సోదరుడు కూడా అర్షద్‌ మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. అర్షద్‌ మరణంతో ‘పెద్ద దిక్కును కోల్పోయాం.. ఇక మేమెలా బతకాలి’ అంటూ ఆ కుటుంబ సభ్యులు చేస్తోన్న ఆక్రందనలు అక్కడి వారి హృదయాలను కలిచి వేశాయి.

మరిన్ని వార్తలు