‘సర్దుకున్నాక రాష్ట్ర హోదా’

8 Oct, 2019 20:38 IST|Sakshi

జమ్మూకశ్మీర్‌పై హోంమంత్రి అమిత్‌షా

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు మెరుగుపడగానే ఆ ప్రాంతాన్ని కేంద్రపాలిత హోదా నుంచి రాష్ట్ర హోదాకు మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. 2018 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ప్రొబేషనరీలతో భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దయ్యాక జమ్మూకశ్మీర్‌లో ఇప్పటి వరకూ ఒక్క బుల్లెట్‌ కూడా పేలలేదని, ఒక్క వ్యక్తి కూడా మరణించలేదని తెలిపారు. కశ్మీరీ సంప్రదాయాలను ఆర్టికల్‌ 370 మాత్రమే కాపాడుతోందని అనుకోవడం పొరపాటని, రాజ్యాంగం ద్వారా ఇతర రాష్ట్రాల సంప్రదాయాలు కూడా కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. ఆర్టికల్‌ 370ని తప్పుడు మార్గంలో ఉపయోగించడం వల్ల ఉగ్రవాదం దేశంలోకి చొచ్చుకొని వస్తోందని అన్నారు. ఎన్నార్సీ కేవలం దేశ క్షేమం కోసమే కాదని, సరైన పాలన అందించడానికి కూడా అవసరమని తెలిపారు.

ఆ దృష్టి మారాలి..
ప్రజల్లో పోలీసులపై ఉన్న చెడు అభిప్రాయాన్ని మార్చాలని ప్రొబెషనరీలకు సూచించారు. దీనికి నిజాయితీతో పనిచేయడం ఒక్కటే మార్గమని తెలిపారు. సమాజ అభివృద్ధి కోసం మనమేం చేస్తున్నామో ప్రతిరోజూ ప్రశ్నించుకోవాలని సూచించారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణ అంటే పాలసీలను పూర్తిగా మార్చడం కాదని, కొత్త సమస్యలను ఎదుర్కొనేందుకు పాత విధానాలను కొత్తగా ఉపయోగించడమేనని తెలిపారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలకు కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. (చదవండి: కశ్మీర్‌లో పర్యాటకులపై ఆంక్షల ఎత్తివేత)

మరిన్ని వార్తలు