చల్లారని కశ్మీర్ లోయ

12 Jul, 2016 01:43 IST|Sakshi
చల్లారని కశ్మీర్ లోయ

23కు చేరిన మృతులు, 250 మందికి గాయాలు
- సోపోర్ పోలీసుస్టేషన్‌కు నిప్పు
- పుల్వామాలో విమానాశ్రయంపై దాడి
పరిస్థితి సమీక్షించిన ఎన్‌ఎస్‌ఏ చీఫ్ దోవల్
- నేడు ప్రధాని మోదీ సమీక్ష
సోనియా, ఒమర్‌కు పరిస్థితి వివరించిన రాజ్‌నాథ్
శ్రీనగర్ లోనే అమర్‌నాథ్ యాత్రికులు
 
 శ్రీనగర్/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్ : కశ్మీర్ లోయలో వరుసగా సోమవారం మూడో రోజూ హింస కొనసాగింది.  ఆందోళనకారులకు  భద్రతాదళాలకు మధ్య కాల్పుల్లో ఇంతవరకూ 23 మంది  మరణించగా, 250 మంది గాయపడ్డారు. అల్లరిమూకలు సొపొరేలో పోలీస్‌స్టేషన్‌కు  నిప్పుపెట్టడంతో పాటు పుల్వామా జిల్లాలో విమానాశ్రయంపై దాడికి  ప్రయత్నించారు. పలు చోట్ల భద్రతా దళాల వాహనాలపై దాడులకు పాల్పడ్డారు.  కుల్గాం జిల్లాలో ఆదివారం జరిగిన హింసలో ఫిరోజ్ అహ్మద్ మిర్(22), ఖుర్షీద్  అహ్మద్ మిర్(38)లు మరణించారని పోలీసులు వెల్లడించారు. దీంతో  సోమవారం నాటికి మృతుల సంఖ్య 23కు చే రింది.

వీరిలో ఒక పోలీసు అధికారి ఉన్నారు. సోమవారం ఉదయం పుల్వామా జిల్లా  కోలిలోని ఎయిర్‌ఫోర్స్ స్థావరంపై ఆందోళనకారుల గుంపు రాళ్లతో దాడికి  పాల్పడింది. ఎయిర్‌పోర్ట్ లోపల ఎండు  గడ్డిని అల్లరిమూకలు తగులబెట్టాయి. భద్రతా దళాలు వారిని చెదరగొట్టినా, మళ్లీ గుంపులుగా ఏర్పడి పోలీసులపై విచ్చలవిడిగా రాళ్ల దాడి చేశారు. ఆదివారం  విమానాశ్రయంపై దాడికి ప్రయత్నించిన అల్లరిమూకను చెదరగొట్టేందుకు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. గండేర్‌బల్ జిల్లాలో ఆందోళనకారులపై పోలీసుల  కాల్పుల్లో ఒకరు గాయపడ్డారు. సోపోర్, హంద్వారా,  బందిపురా, బారాముల్లా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భద్రతాదళాలపైకి ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. సోపోర్ పండ్ల మార్కెట్ వద్ద ఉన్న  పోలీసుస్టేషన్‌కు నిప్పుపెట్టారు. అనంత్‌నాగ్ జిల్లా జిర్పొరాలో సోమవారం గుర్తు తెలియని  ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. కేంద్రం సోమవారం అదనంగా 800 మంది సీఆర్‌పీఎఫ్ బలగాల్ని జమ్మూ కశ్మీర్‌కు పంపింది.  

 లోయలో జనజీవనం అస్తవ్యస్తం
 దక్షిణ కశ్మీర్‌లోని నాలుగు జిల్లాల్లో మొబైల్ ఫోన్ సేవల్ని సోమవారమూ నిలిపివేశారు. శ్రీనగర్‌తో పాటు కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో ప్రజల  కదలికలపై నిఘా కొనసాగుతోంది. కర్ఫ్యూ నేపథ్యంలో దుకాణాలు, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార  సంస్థలు, పెట్రోల్ బంకులు మూతబడే ఉన్నాయి.  ప్రజా  రవాణా స్తంభించింది.  వర్సిటీలు పరీక్షల్ని వాయిదా వేశాయి.  వేర్పాటు వాద  నేలు సయ్యద్ అలీ షా గిలానీ, మిర్వైజ్ ఫరూక్, యాసిన్ మాలిక్‌లు గృహనిర్బంధంలో కొనసాగుతున్నారు.

 పరిస్థితి సమీక్షించిన దోవల్..
 జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కెన్యా పర్యటన  రద్దు చేసుకుని ఒక రోజు ముందుగానే భారత్ చేరుకున్నారు. ‘సమస్యలుంటే.. వాటి పరిష్కారాలూ ఉంటాయి. పరిష్కారం కనుగొనడంలో మేం పూర్తి నమ్మకంతో,  సామర్థ్యంతో ఉన్నాం’ అని దోవల్ చెప్పారు.  

 సోనియాకు పరిస్థితి వివరించిన రాజ్‌నాథ్
 కశ్మీర్ కల్లోలంపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాకు వివరించారు. కశ్మీర్ లోయలో శాంతి నెలకొల్పేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. మరోవైపు జాతీయ భద్రత కు సంబంధించిన అంశాల్లో రాజీలేదని సోనియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా అమర్‌నాథ్ యాత్రికులు మూడో రోజూ శ్రీనగర్‌లో చిక్కుకుపోయారు. వీరంతా శ్రీనగర్‌లోని పర్యాటక కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు.   
 
 ప్రాణాంతకం కాని పద్ధతులు రూపొందించాలి
 న్యూఢిల్లీ:  హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ కాల్చివేతపై తలెత్తిన ఘర్షణల్లో ప్రాణనష్టం సంభవించటం దురదృష్టకరం, విచారకరమని బీజేపీ కశ్మీర్ వ్యవహారాల ఇన్‌చార్జి రాంమాధవ్ పేర్కొన్నారు. ఇలాంటి నిరసనలను నియంత్రించటానికి ప్రాణాంతకం కాని పద్ధతులను రూపొందించాలన్నారు. ఆ ఘర్షణల్లో పోలీసులు కూడా భారీగా నష్టపోయారంటూ.. శాంతి, సంయమనం అనేవి ప్రజలు, పోలీసుల అభిమతం కావాలని సామాజిక వెబ్‌సైట్ ట్వీటర్‌లో సూచించారు. ఆయన అంతకుముందు.. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి ఉగ్రవాదంపై పోరాటం చాలా ముఖ్యమని, విస్ఫోటనమున్నా లేకున్నా అందుకు ప్రభుత్వం దృఢంగా నిలబడుతుందని వ్యాఖ్యానించారు.
 
 కశ్మీర్ అంశంలో పాక్ జోక్యం అనవసరం: భారత్
 హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ మృతిపై పాక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంపై సోమవారం భారత్ దీటుగా స్పందించింది. ఉగ్రవాదంతో పాక్‌కు ఉన్న అనుబంధం ఆ దేశ వ్యాఖ్యలతో నిరూపితమైందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఒక ప్రకటనలో ఘాటుగా సమధానమిచ్చింది. హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు స్పందిస్తూ కశ్మీర్ గురించి కాకుండా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై పాక్ ముందుగా ఆందోళన చెందాలని సూచించారు. అంతకముందు బుర్హాన్ ఎన్‌కౌంటర్‌ను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఖండించారు. బుర్హాన్ మృతికి నిరసన తెలుపుతున్నవారిపై అన్యాయంగా బలగాల్ని ప్రయోగించారని, ఐరాస తీర్మానాల మేరకు భారత్ మానవ హక్కుల్ని అమలు చేయాలన్నారు.
 
 నేడు ప్రధాని సమీక్ష
 ప్రధాని నరేంద్ర మోదీ నేడు కశ్మీర్‌లో పరిస్థితిని సమీక్షించనున్నారు. ఆఫ్రికా పర్యటన ముగించుకుని భారత్‌కు రాగానే కశ్మీర్ హింసపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారని సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. భారత్ గురించి కాకుండా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై పాకిస్తాన్ ముందుగా ఆందోళన చెందాలని హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు సూచించారు.

>
మరిన్ని వార్తలు