కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం మహిళలయితే!

7 Jul, 2018 23:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లో శనివారం జరిగిన కాల్పుల్లో ఓ బాలికతోపాటు మరో ఇద్దరు అమాయకులు మరణించారు. ఇది కశ్మీర్‌కు కొత్త కాదు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న రక్తపాతమే. కశ్మీర్‌ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నా ఫలితం లేకుండా పోవడం. కశ్మీర్‌ ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోవడం సాధారణ విషయమే. ఈ సంక్షోభంలో పాత్రదారులు నలుగురు లేదా నాలుగు శక్తులు. ఒకటి భారత రాజకీయ నాయకత్వం, రెండూ భారత సైన్యం, మూడు పాక్‌– దేశీయ టెర్రరిస్టులు. నాలుగు కశ్మీర్‌ ప్రజలు. 

భారత రాజకీయ నాయకత్వం దేశీయ, అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ను ఏకాకిని చేయడానికి లేదా టెర్రరిస్టులకు ఎలాంటి మద్దతు ఇవ్వకుండా నిలువరించేందుకు తెర ముందు నుంచి కాకుండా తెర వెనక నుంచి కూడా కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తోంది. ఇక భారత సైన్యం స్థానిక టెర్రరిస్టులను ఎప్పటికప్పుడు అణచివేయడంతోపాటు అప్పుడప్పుడు పాకిస్థాన్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయి సర్జికల్‌ స్ట్రైక్స్‌ కూడా చేస్తోంది. ఎంత మంది టెర్రరిస్టులు హతమైనా మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇటు సైన్యం, అటు టెర్రరిస్టుల మధ్య నలిగి పోతున్నది అక్కడి ప్రజలే.

ఎన్ని కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నా అవి కనుమూసి తెరిచే లోగా కాలగర్భంలో కలిసిపోవచ్చు. కేంద్రంలో ఉన్న రాజకీయ నాయకత్వాన్ని బట్టి కశ్మీర్‌లో కొద్ది ఎక్కువ కాలం, కొద్ది తక్కువ కాలం ప్రశాంత పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత మళ్లీ రక్తపాతం మామూలే. ఈ సైకిల్‌ ఇలా తిరగాల్సిందేనా! కశ్మీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లేకపోయినా శాశ్వత శాంతికి సంధినొసిగే ఆస్కారాలే లేవా?

కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం అనే నినాదాన్ని భారత్‌ వదులుకోనంతకాలం కశ్మీర్‌కు శాశ్వత పరిష్కారం లేదన్న విషయం విజ్ఞులెవరికైనా తెల్సిందే. వాస్తవానికి ఒకప్పటి కశ్మీర్‌ రాజ్యంలో 40 శాతం భూభాగం భారత్‌ ఆధీనంలో, మరో 40 శాతం భూభాగం పాకిస్థాన్‌ ఆధీనంలో ఉండగా, మిగతా 20 శాతం భూభాగం చైనా ఆధీనంలో ఉంది. మన ఆధీనంలో ఉన్న భూభాగాన్ని మనం కశ్మీర్‌ అని, పాక్‌ ఆధీనంలో ఉన్న భూభాగాన్ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ అని మనం వ్యవహరిస్తున్నాం.

అలాగే మనది అంటున్న కశ్మీర్‌ను పాకిస్తాన్‌ వారు ‘భారత ఆక్రమిత కశ్మీర్‌’ అని వ్యవహరిస్తున్నారు. చైనా ఆధీనంలో ఉన్న 20 శాతం కశ్మీర్‌ భూభాగాన్ని ‘అక్సాయ్‌ చిన్‌’ అని చైనా వ్యవహరిస్తోంది. చైనా తెలివిగా కశ్మీర్‌ విషయంలో తన జోలికి రాకుండా పాకిస్థాన్‌కు మద్దతుగా పావులు కదుపుతూ వస్తోంది. మరోపక్క అదే పాకిస్థాన్‌తో కలిసి అద్భుతమైన ఆర్థిక కారిడార్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. 

అక్సాయ్‌ చిన్‌ ప్రాంతాన్ని అంతగా పట్టించుకోని మనం ఎప్పుడూ పాకిస్థాన్‌తోనే గొడవ పడతాం. అది మరో మతానికి సంబంధించిన దేశం కావడమే కావొచ్చు. కశ్మీర్‌ దక్కడం వల్ల అటు పాకిస్థాన్‌కుగానీ, చైనాకుగానీ ఒరిగేదేమీ లేదు. మనకొచ్చే ప్రయోజనాన్ని పక్కన పెడితే కశ్మీర్‌ పేరిట మనం దేశ సంపదనే తగలేస్తున్నామని ఆర్థిక వేత్తలే తేల్చి చెప్పారు. కశ్మీర్‌ పేరిట భారత్‌ ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తంలో సగంలో సగం మొత్తాన్ని పాకిస్థాన్‌కు భరణంగా ఇస్తే వాళ్లే మనకు కశ్మీరును పల్లెంలో పెట్టి ఇచ్చే వారన్న వ్యాఖ్యానాలు కొత్త కాదు.

ఇప్పుడు ఆ దేశ పరిస్థితే మారిపోయింది. బలహీనమైన రాజకీయ నాయకత్వమే కావచ్చు. అక్కడ టెర్రరిస్టు ముఠాలు విచ్చల విడిగా పెరిగి పోయాయి. పాకిస్థాన్‌ చెబితే వినే దశలో అసలే లేవు. అందుకని ఆ ముఠాలను ఉద్దేశపూర్వకంగానే కశ్మీర్‌ లక్ష్యం కోసం పాకిస్థాన్‌ పంపిస్తోంది. ఇక చైనా ఆర్థిక కారిడార్‌ పేరుతో అగ్నేయ పాకిస్థాన్‌ అంతట విస్తరించింది. బలుచిస్థాన్‌లో చిన్న తిరుగుబాటును భారత్‌ ప్రోత్సహించినా వెంటనే అణచివేసే పరిస్థితికి చైనా చేరుకుంది. భారత్‌లోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకొని దాడి చేయగల సామర్థ్యాన్నీ సాధించింది. కశ్మీర్‌ కారణంగా ఎంతో ఆర్థికంగా దెబ్బతిన్న భారత్‌ ఆర్థిక వ్యవస్థలో చైనాకు అందనంత దూరంలోనే ఆగిపోతోంది. 

ఇక్కడే కొత్తగా ఆలోచించాలి!
మరి కశ్మీర్‌కు పరిష్కారం ఏమిటీ? ఇక్కడే కొత్తగా ఆలోచించాలి. ‘భిన్న ఫలితాలను ఆశిస్తూ చేసిందే చేస్తూ చేసిందే చేస్తూ పోయేవాడు పిచ్చివాడే’ అవుతాడు అని ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ ఎప్పుడో చెప్పారు. ఇంటా బయట చర్చలు, ఒప్పందాలు ఇప్పటి వరకు పెద్దగా ఫలితాలివ్వలేదు. శత్రువు, శత్రువు మధ్య ఉండే ఉమ్మడి విషయాన్ని కనుగొనాలి.  సైన్యం, మిలిటెంట్ల పోరులో ఎవరు మరణించిన బాధ పడుతున్నది ఎక్కువగా మహిళలే. కశ్మీర్‌ మిలిటెంట్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ జాఫర్‌ హతమైనప్పుడు కడుపుకోతకు గురైనది ఆయన తల్లే. ఓ ఆదర్శమూర్తిగా స్థానికంగా ఆమెకు ఎంతో పేరుంది. ఆమెకున్న పేరు కారణంగానే ఆయన అంత్యక్రియల్లో కొన్ని లక్షల మంది కశ్మీర్‌ ప్రజలు పాల్గొన్నారు.

జూన్‌ 15వ తేదీన భారత సైనికుడు ఔరంగా జేబ్‌ను మిలిటెంట్లు కిడ్నాప్‌ చేసి హత్య చేస్తే ఆయన తల్లి కూడా అంతే బాధ పడింది. ఆ తల్లికి కూడా స్థానికంగా మంచి పేరుంది. ఇక్కడ ఇద్దరు తల్లులు అనుభవించిన బాధ ఒకలాంటిదే. ఇలాంటి తల్లులను కలుపుకుపోయి శాంతి చర్చలు జరిపితే. మగవాళ్లు జరిపే శాంతి చర్చలు 30 శాతం ఫలించే అవకాశం ఉంటే మహిళలు జరిపే శాంతి చర్చలు 65 శాతం ఉంటాయని పలు అంతర్జాతీయ శాంతి ఒప్పందాలే తెలియజేస్తున్నాయి.

పైగా మహిళలు కుదుర్చుకునే శాంతి ఒప్పందాలు 15 ఏళ్లకు పైగా నిలబడే అవకాశాలు 34 శాతం ఉన్నాయట. అపార రక్తపాతంతో వచ్చే విజయాలు మహిళలకు సాధారణంగా రుచించవని, వారు అన్ని అంశాలను పిల్లల భవిష్యత్తు కోణం నుంచే చూస్తారుకనుక వారి మధ్య చర్చలు ఎక్కువగా ఫలిస్తాయని సామాజిక విశ్లేషకులు ఇదివరకే తేల్చారు. కశ్మీర్‌లోని ఇరువర్గాల బాధిత మహిళలను, మహిళా సంఘాలను, సామాజిక మహిళా కార్యకర్తలను శాంతి చర్చల ప్రక్రియలోకి తీసుకరావడం వల్ల ఆశించిన ఫలితం రావచ్చు!

మరిన్ని వార్తలు