పండిట్ల ఘర్‌ వాపసీ!

6 Aug, 2019 05:42 IST|Sakshi

370 రద్దుతో కశ్మీరీ పండిట్లలో ఉత్సాహం

తమ ఇళ్లకు తిరిగెళ్లే రోజులు దగ్గర్లో ఉన్నాయంటూ హర్షం

దేశమంతా జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయంపై వాదోపవాదనలు జరుగుతుంటే.. కశ్మీరీ పండిట్లు సంబరాలు చేసుకుంటున్నారు. వీరు కశ్మీర్‌ను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది.. ఎందరు విడిచి వెళ్లారు? ఇప్పుడెక్కడ స్థిరపడ్డారు? లోయలో ఇప్పుడెందరున్నారు? చూద్దాం...

మూడు కేటగిరీలు పండిట్లు..
కశ్మీరీ పండిట్ల సమాజం ముఖ్యంగా మూడు వర్గాలు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది బన్మాసీల గురించి. కశ్మీర్‌ లోయ ముస్లిం రాజుల పాలనలో ఉన్నప్పుడు వీరంతా వ్యాలీని వదిలేసి వెళ్లిపోయి.. కొన్నేళ్లకు తిరిగి వచ్చారు. ఇక రెండో కేటగిరీ మల్మాసీ. లోయలో జరుగుతున్న అన్ని కష్టనష్టాలను తట్టుకొని అక్కడే స్థిరపడ్డారు. మూడో కేటగిరీ బుహ్రీస్‌. వ్యాపార వ్యవహరాలు సాగించే పండిట్లంతా ఈ కేటగిరీ వారే. అయితే 1989లో పండిట్ల భారీ వలసలతో వీరి మధ్య వ్యత్యాసాలు చాలా తగ్గిపోయాయి.

డోగ్రా పాలనలో..
1846 నుంచి 1947 వరకు డోగ్రా రాజవంశ పాలనలో ముస్లింల సంఖ్య మెజారిటీగానే ఉన్నప్పటికీ కశ్మీరీ పండిట్ల హవా సాగింది. ఈ కాలంలో లోయలో అధికంగా ఉన్న ముస్లింలతో సఖ్యతగానే ఉంటూ పండిట్లు జీవనం సాగించారు. అయితే 1950 భూ సంస్కరణ నిర్ణయాల ఫలితంగా 20 శాతం పండిట్లు కశ్మీర్‌ లోయను వదిలేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 1981 నాటికి లోయలో పండిట్ల జనాభా కేవలం 5 శాతం.  

పెరిగిన అకృత్యాలు
1989 మధ్య నాటికి ఇస్లామిక్‌ ఉగ్రవాదం పెరిగిపోయింది. పండిట్లలోని పురుషులను చంపడం, మహిళలపై అత్యాచారాలు జరపడం, వారి ఇళ్లలో చోరీలు చేయడం అధికమయ్యాయి. తప్పనిసరి పరిస్థితులో పండిట్లు లోయను వదిలేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కొన్ని కథనాల ప్రకారం 1990లో సుమారు 1,40,000 మంది పండిట్ల జనాభా ఉందని అంచనా వేయగా.. వారిలో లక్ష మంది కశ్మీర్‌ను వదిలేశారు. వలస వెళ్లిన వారిలో అధికంగా జమ్మూ, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరపడ్డారు.

పండిట్లకు బాల్‌ థాక్రే సాయం..
కశ్మీర్‌ నుంచి వలస వచ్చిన పండిట్లకు మొదటగా సాయం చేసింది శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ థాక్రే. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పండిట్ల కుటుంబాల్లోని పిల్లలకు ఆయన రిజర్వేషన్లు కల్పించారు. కాగా జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం లెక్కల ప్రకారం 2010లో కశ్మీర్‌లో 808 పండిట్ల కుటుంబాల్లో మొత్తం 3,445 మంది జనాభా ఉన్నట్లు తేలింది. 

మరిన్ని వార్తలు