యోగికి ఝలక్‌: ఆయనను కలిసేందుకు మేం రాం!

27 Sep, 2019 12:51 IST|Sakshi

లక్నో: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు నేపథ్యంలో అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో చదువుతున్న కశ్మీరీ విద్యార్థులకు చేరువయ్యేందుకు ప్రయత్నించిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు చుక్కెదురైంది. ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌కు కలిగే ప్రయోజనాలను వివరిస్తాను.. తనతో ముఖాముఖి మాట్లాడేందుకు రావాలని యోగి పంపిన ఆహ్వానాన్ని కశ్మీర్‌ విద్యార్థులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

యోగి ఆహ్వానం రాజకీయ స్వభావంతో ఉందని, దీనిని అంగీకరించబోమని ఏఎంయూలో చదువుతున్న కశ్మీరీ విద్యార్థులు తేల్చిచెప్పారు. యోగితో సమావేశానికి వెళ్లరాదని కశ్మీరీ విద్యార్థులు ఏకగ్రీవంగా, మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారని, ఎవరైనా వెళ్లి సీఎంను కలిస్తే.. అది వారి వ్యక్తిగత అభీష్టంగా చూడాలి కానీ, కశ్మీరీ విద్యార్థుల అభిప్రాయంగా చూడరాదని ఓ కశ్మీరీ రీసెర్చ్‌ స్కాలర్‌ చెప్పారు. యోగి ఆహ్వానం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని, ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కూడా కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని, అందరూ ఆనందంగా ఉన్నారని ప్రపంచానికి చూపేందుకు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని మరో కశ్మీరీ విద్యార్థి పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు