కథువా ఘటన : న్యాయవాదికి ఎమ్మా వాట్సన్‌ మద్దతు

5 May, 2018 09:06 IST|Sakshi

లాస్‌ ఏంజెల్స్‌ : జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెల్లుబిక్కుతున్న సంగతి తెలిసిందే. అత్యంత కిరాతకమైన ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. తాజాగా హ్యారీ పోర్టర్‌ నటి ఎమ్మా వాట్సన్‌ స్పందించారు. అత్యాచార బాధిత తరుఫున వాదిస్తున్న న్యాయవాది దీపికా సింగ్‌ రజావత్‌కు ఆమె మద్దతు తెలిపారు. 

దీపికా సింగ్‌ రజావత్‌కు మద్దతు తెలుపుతూ ఎమ్మా వాట్సన్‌ శుక్రవారం ఓ ట్వీట్‌ చేశారు. ఓ ఆర్టికల్‌ను షేర్‌ చేస్తూ... దీపికా సింగ్‌ రజావత్‌కే అన్ని అధికారాలు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మా వాట్సన్‌ ఐక్యరాజ్యసమితిలో మహిళల గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఉన్నారు. యువతుల్లో సాధికారిత కలిగించేందుకు ఆమె క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఎమ్మా వాట్సన్‌ షేర్‌చేసిన ఆర్టికల్‌లో రజావత్‌ నమ్మకాన్ని, వృత్తి పట్ల  ఆమెకున్న వైఖరిని పేర్కొన్నారు. 

కథువా అత్యాచార ఘటనకు సంబంధించి మొట్టమొదట రిట్‌ పిటిషన్‌ వేసిన లాయర్‌ దీపికా సింగ్‌ రజావత్‌. చిన్నారిపై జరిగిన ఘాతుకానికి చలించి కథువాలోని ఆ పాప తండ్రిని కలిసి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసును చేపట్టిన వెంటనే ఆమెకు బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా ఆమె భయపడకుండా.. హంతకులకు శిక్షపడి, ఆ పాప తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు వెనక్కితగ్గేది లేదని కరాఖండిగా చెప్పారు. కశ్మీరీ పండిట్‌ అయిన 38 ఏళ్ల దీపికా సింగ్‌ రజావత్‌ స్వస్థలం కశ్మీర్‌ ఉత్తర ప్రాంతంలోని సరిహద్దు జిల్లా కుప్వారాలో కరిహామా గ్రామం. 

ఈ చిన్నారి తరుఫున వాదిస్తున్న రజావత్‌కు బెదిరింపులు ఎక్కువ అవడంతో, ఆమెకు సెక్యురిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సైతం ఆదేశించింది. రజావత్‌తో పాటు, చిన్నారి కుటుంబానికి, బాధిత కుటుంబానికి సాయంగా ఉన్న బకర్‌వాల్‌ కమ్యూనిటీ సభ్యుడు తలీబ్‌ హుస్సేన్‌కు కూడా సెక్యురిటీ ఏర్పాటు చేయాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ హైకోర్టులో ఈ కేసు వాదనలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు