దీపికా రజావత్‌కు ఊహించని షాక్‌!

15 Nov, 2018 17:45 IST|Sakshi

శ్రీనగర్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా సామూహిక అత్యాచార ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి తరపున వాదిస్తున్న లాయర్‌ దీపికా రజావత్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రాణాలకు తెగించి మరీ ఈ కేసును వాదిసున్న దీపికాకు.. ఇకపై ఆమె సేవలు తమకు అక్కర్లేదంటూ బాధిత కుటుంబం షాక్‌ ఇచ్చింది. ముస్లిం తెగకు చెందిన చిన్నారి తరపున వాదిస్తున్నందుకు దీపికాను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్‌ ప్రభుత్వం  ఆమెకు భద్రత కల్పించింది. 

కాగా సున్నితమైన ఈ ఘటన కారణంగా మతపరమైన అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నందున పంజాబ్‌లోని పఠాన్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు సుప్రీంకోర్టు ఈ కేసును బదిలీ చేసింది. ఈ క్రమంలో కేసు విచారణ సమయంలో దీపిక కేవలం రెండుసార్లు మాత్రమే కోర్టుకు హాజరయ్యారని, ఇలా అయితే తమకు న్యాయం జరగదని చిన్నారి తండ్రి భావిస్తున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు. అంతేకాకుండా 100 సార్లు కేసు విచారణకు వచ్చిందని, 100 మంది సాక్ష్యులను విచారించినా ఇంతవరకు ఎటువంటి పురోగతి కనిపించలేదని ఆరోపిస్తూ లాయర్‌ను మార్చుకుంటున్నట్లు ఆయన పఠాన్‌ కోర్టుకు దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు