కావేరి మంటలు

13 Sep, 2016 02:11 IST|Sakshi
కావేరి మంటలు

జల వివాదంతో భగ్గుమన్న కర్ణాటక, తమిళనాడు

- కర్ణాటకలో రెచ్చిపోయిన నిరసనకారులు..తమిళుల వాహనాలు, ఆస్తులు లక్ష్యంగా దాడులు

- దహనాలు, లూటీలు... బెంగళూరులో ఒక్క రోజే 100 వాహనాలు దగ్ధం

- బెంగళూరులో పోలీసు కాల్పుల్లో ఒకరి మృతి

- తమిళనాడులోనూ పేట్రేగిన హింస..

- కర్ణాటకకు వ్యతిరేకంగా తమిళ సంఘాల నిరసన ప్రదర్శనలు.. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు

- కర్ణాటకకు 10 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు..అవసరమైతే తమిళనాడుకూ: కేంద్రం
 

సాక్షి ప్రతినిధి, బెంగళూరు/చెన్నై: కావేరి నదీ జలాల పంపిణీపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం మరింతగా ముదిరిపోయి హింసాత్మకంగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. సోమవారం ఇరు రాష్ట్రాల్లోనూ.. అవతలి రాష్ట్రానికి చెందిన ఆస్తులు, పౌరులు లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. కర్ణాటకలో అయితే అల్లరిమూకలు రెచ్చిపోవడంతో రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున 10 రోజుల పాటు కావేరి జలాలు విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశం ఇచ్చింది. ఆ వెనువెంటనే అల్లరిమూకలు పేట్రేగిపోయాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని బెంగళూరు నిప్పుల కొలిమిగా మారింది. నగరంలో 100కు పైగా బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి.

తమిళనాడులోనూ కర్ణాటకకు చెందిన సంస్థలు, వాహనాలపై దాడులు జరిగాయి. నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు సహా వాహనాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ఈ హింసకు మీరంటే మీరు కారణమంటూ రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీలు, సంస్థల నాయకులు ఎదుటి రాష్ట్రంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. తమ రాష్ట్ర ప్రజలపై దాడులు చేస్తే సహించేది లేదని దుండగులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ‘మీ రాష్ట్రంలో మా రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పించండి’ అంటూ పరస్పరం లేఖలు రాసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పూర్తి సాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. పరిస్థితి తీవ్రంగా ఉన్న కర్ణాటకకు 10 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పంపించింది. అవసరమైతే తమిళనాడులోనూ ఈ బలగాలను మోహరిస్తామని చెప్పింది. పరిస్థితి ఇలావుంటే.. కావేరి పర్యవేక్షక కమిటీ నదీ జలాల విడుదల విషయంపై ఎటువంటి నిర్ణయం చేయకుండా సమావేశాన్ని 19వ తేదీకి వాయిదా వేసింది.

 

 ఒకవైపు తమిళనాడులో కర్ణాటక వాసులపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారంతో పాటు.. మరొకవైపు కావేరి నీటి విడుదల ఆదేశాలను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించిన వార్త వెలువడిన వెంటనే.. కర్ణాటకలో ఒక్కసారిగా హింస చెలరేగింది. వాహనాల దహనాలు, పలు సంస్థలు, దుకాణాలపై దాడులతో రాష్ట్రం అట్టుడికింది. రాజధాని బెంగళూరులో తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు కలిగివున్న బస్సులు, ట్రక్కులతో సహా దాదాపు 100 వాహనాలను అల్లరిమూకలు దగ్ధం చేశాయి. అందులో తమిళనాడుకు చెందిన కేపీఎన్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు 40 వరకూ ఉన్నాయి. తమిళనాడు మూలాలు గల పలు దుకాణాలు, సంస్థలపై దాడులు, లూటీలతో బెంగళూరు వణికిపోయింది. నగరంలోని రాజగోపాల్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హగ్గేనహళ్లి వద్ద వాహనాలకు నిప్పంటిస్తున్న అల్లరిమూకలపై పోలీసులు కాల్పులు జరపగా.. ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. మండ్య, మైసూరు, చిత్రదుర్గ, ధార్వాడ్ జిల్లాల్లో కూడా పరిస్థితి అదుపుతప్పింది. దీంతో.. బెంగళూరు, మండ్య, మైసూరు నగరాలతో పాటు.. కర్ణాటకలో కావేరి నదిపై గల 4 జలాశయాల చుట్టుపక్కల 144 సెక్షన్ కింద మూడు రోజుల పాటు నిషేధాజ్ఞలు విధించారు. కర్ణాటకలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పది కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను రాష్ట్రానికి పంపింది.
 

 జయ, సిద్ధరామయ్యల లేఖలు...

 కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం రాత్రి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జయలలిత, సిద్ధరామయ్యలతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రాల్లో శాంతిభద్రతల వ్యవహారంలో కేంద్రం నుంచి పూర్తి సాయం అందిస్తామన్నారు. అనంతరం.. కర్ణాటక ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తూ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని పేర్కొంది. కర్ణాటకలో హింస ఆందోళనకరంగా ఉందని, తమిళ ప్రజలు, వారి ఆస్తులకు రక్షణ కల్పించాలని తమిళనాడు సీఎం జయలలిత కర్ణాటక ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం అంతకు కొన్ని గంటల ముందే అదే తరహా లేఖను జయలలితకు రాశారు. తమిళనాడులో కర్ణాటక ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని జయ తన లేఖలో హామీ ఇచ్చారు. ఇదిలావుంటే.. కావేరి జలాలపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం రాష్ట్రానికి వ్యతిరేకంగా వచ్చినట్లయితే రాష్ట్రంలో కొన్ని నిరసనలు జరుగుతాయని భావించామని.. కానీ ఇంత దూరం వెళతాయని తమ ప్రభుత్వం ఊహించలేదని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర పేర్కొన్నారు.

 

 బెంగళూరు భగభగ

బెంగళూరులోని డిసౌజా నగర్‌లో కేపీఎన్ ట్రావెల్స్‌కు చెందిన డిపోలో 50 బస్సులు నిలిపి ఉంచగా.. నిరసనకారులు సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో డిపో వద్దకు చేరుకుని రెండు బస్సులకు నిప్పు పెట్టి పరారయ్యారు. బస్సుల ట్యాంకర్లలో డీజిల్ ఎక్కువగా ఉండటంతో మంటలు అన్ని బస్సులకూ వ్యాపించాయి. అక్కడి మార్గంలో దాదాపు ఒకటిన్నర కిలోమీటరు పొడవునా రోడ్లపై  నిరసనకారులు టైర్లకు నిప్పు పెట్టడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి సకాలంలో చేరుకోలేకపోయారు. గంటన్నర తర్వాత చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మొత్తం బస్సుల్లో 44 పూర్తిగా దగ్ధం కాగా, మిగిలినవి 60 శాతానికి పైగా తగలబడిపోయినట్లు సమాచారం. ఈ ట్రావెల్స్ తమిళనాడు వాస్తవ్యుడైన నటరాజన్‌కు చెందినదని చెప్తున్నారు.

దుండగులు బెంగళూరులోని నైస్ రోడ్డుపై తమిళనాడు రవాణా శాఖకు చెందిన బస్సులకు కూడా నిప్పంటించారు. నందినీ లేఅవుట్‌లో పోలీసు వాహనాన్ని దగ్ధం చేశారు. బెంగళూరులోని కన్‌వర్జీస్ సాఫ్ట్‌వేర్ సంస్థలోకి నిరసనకారులు చొచ్చుకెళ్లి అక్కడి సిబ్బందిని బయటికి పంపించేశారు. ఈ విషయం తెలుసుకున్న మరికొన్ని ఐటీ కంపెనీలు నైట్‌షిఫ్ట్ ఉద్యోగులకు సెలవు ప్రకటించాయి. అడియార్ ఆనంద్‌భవన్, పూర్విక మొబైల్ దుకాణాలకు చెందిన పలు శాఖలపై దాడులు చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

యాదగిరిలో తమిళనాడు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంక్‌ను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. నగరంలో నిరసనల ఉధృతి నేపథ్యంలో సాయంత్రం 4:30 నుంచి బీఎంటీసీ బస్సు సర్వీసులను పూర్తిగా రద్దు చేసింది. తమిళనాడుకు వెళ్లే దాదాపు అన్ని బస్సులను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నమ్మమెట్రో సేవలు కూడా సాయంత్రం ఆరుగంటల తర్వాత నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో మండ్యలో ఈనెల 17 వరకూ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ జియాఉల్లా సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.
 

 పోలీస్ కాల్పుల్లో ఒకరి మృతి

 బెంగళూరు రాజగోపాల్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హగ్గేనహళ్లి  50 మంది నిరసనకారులు రెచ్చిపోయారు. బందోబస్తులో భాగంగా అక్కడికి వచ్చిన పోలీసుల వాహనంపై దాడి చేసి నిప్పు పెట్టారు. అక్కడే ఉన్న మరికొన్ని వాహనాలను ధ్వంసం చేయడానికి యత్నించారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి, గాలిలో కాల్పులు జరిపారు. ఫలితం లేకపోవడంతో నిరసనకారులపై  కాల్పులు జరపగా.. ఐదుగురు గాయపడ్డారు. తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా సింగేనహళ్లికి చెందిన ఉమేశ్(25) వెన్ను నుంచి ఛాతిలోకి తూటా దూసుకెళ్లడంతో మృతిచెందాడు. మరొకరు కోమాలోకి వెళ్లాడు. నగరంలోని హొసగుడ్డద హళ్లి వద్ద నిరసనకారులు తమిళనాడుకు చెందిన రెండు ప్రైవేటు బస్సులకు నిప్పుపెట్టారు. వారు లారీలకు నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు లాఠీ చార్జీ చేశారు. అయితే నిరసనకారులు రాళ్లతో దాడికి దిగడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. మొత్తంగా 10 మంది పోలీసులు గాయపడ్డారు. గోపాలన్ మాల్ వద్ద హింసను టీవీ చానల్ కోసం చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై నిరసనకారులు దాడి చేశారు.

 

మరిన్ని వార్తలు