ఇస్త్రీ పెట్టె, ట్రక్కు గుర్తులను రద్దు చేయండి: కేసీఆర్

27 Dec, 2018 16:18 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నిర్వచన్ సదన్‌లో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాతో సమావేశమయ్యారు. ఇస్త్రీ పెట్టె, ట్రక్కు వంటి కారు గుర్తును పోలిన గుర్తులను రద్దు చేయాలని ఈ సందర్భంగా అరోరాని కేసీఆర్‌ కోరారు. తెలంగాణలో ఓట్ల తొలగింపు వల్ల టీఆర్ఎస్‌కు నష్టం‌ జరిగిందని, తొలగించిన ఓట్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. లోక్ సభ ఎన్నికల‌కు ముందే సవరణలు చేయాలని కోరారు. ఎంపీలు వినోద్ కుమార్, బండ ప్రకాశ్‌లు కేసీఆర్ వెంట ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ బుధవారం ప్రధాని మోదీని కలిసి పలు కీలక అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.

తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగిందని ఎంపీ వినోద్ అన్నారు. 'ట్రక్కు, కెమెరా, ఇస్త్రీ పెట్టె, హ్యాట్ గుర్తులపై సునీల్ అరోరాతో కేసీఆర్ చ‌ర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో కారు గుర్తును పోలిన ట్రక్కుతో ఓట‌ర్లు గంద‌ర‌గోళానికి గుర‌య్యారు. 15 మంది అభ్యర్థులకు వెయ్యి నుంచి 15 వేల ఓట్ల నష్టం జరిగింది. వెయ్యి ఓట్ల వరకు చాలా నియోజక వర్గాల్లో నష్టం జరిగింది. అందువ‌ల్ల ట్ర‌క్కు సింబ‌ల్ ఇక‌పై ఇవ్వొద్దని, ఎవ‌రికీ కేటాయించ‌వ‌ద్ద‌ని కేసీఆర్‌ సునీల్‌ అరోరాను కోరారు. ప్ర‌జా స్వామ్యంలో ఓట‌ర్ల‌కు అనువుగా గుర్తులు ఉండాలి. ఓట‌ర్ల‌ను గంద‌రగోళానికి గురి చేసేలా గుర్తులు ఉండ‌కూడద‌ని సీఎం కోరారు. ఎన్నికల ముందే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఎంపీలందరం ఫిర్యాదు చేశాము. కానీ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఏమి చేయలేమని అన్నారు. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కారును పోలిన గుర్తులను కేటాయించవద్దని, కారు గుర్తు సైతం పలుచని రంగులో ఉన్నందున ఆ రంగును పెంచాలని సీఎం కేసీఆర్ కోరారు. త్వ‌ర‌లోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం భేటి అయి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సునిల్ అరోరా కేసీఆర్‌కు తెలిపారు. తెలంగాణలో ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా సాగినందుకు కేసీఆర్ కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు' అని ఎంపీ వినోద్‌ తెలిపారు.
(కారుకు ట్రక్కు బ్రేకులు!)

మరిన్ని వార్తలు